తెలుగుదేశం పార్టీలో టికెట్లు రావనే భయంతోనే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు వైకాపాలో చేరారని... మంత్రి నక్క ఆనందబాబు విమర్శించారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి... పార్టీ మారిన ముగ్గురూ కులాల పేరుతో విమర్శలు చేయడం దారుణమన్నారు. ఎన్నికల వేళ ఆయారాం గయారాంలు ఎక్కువయ్యారని ఎద్దేవా చేశారు.
రవీంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో సాక్షి ప్రచురించిన కథనాలను ఆనందబాబు ప్రదర్శించారు. రవీంద్రబాబు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటే తెదేపా టికెట్ ఇచ్చి ఎంపీని చేసిందని గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ తెదేపా నుంచి వైకాపాలోకి వలసల్ని ప్రోత్సాహిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో ఆస్తులున్నవారు కేసీఆర్కు భయపడుతున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, జగన్తో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.