Guntur District News: గుంటూరు జిల్లా సుద్దపల్లిలో వైకాపా నేతలు అక్రమంగా మట్టి తవ్వేస్తున్నారంటూ తెలుగుదేశం చేపట్టిన ఆందోళనతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. గనులు, రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై నివేదిక రూపొందించినట్లు గనులశాఖ సంచాలకుడు వెంకటరెడ్డి వెల్లడించారు. సుద్దపల్లి పరిధిలో 2014 నుంచి మైనింగ్ జరుగుతోందన్నారు. 2014 - 19 మధ్య కాలంలో 16 వేల 399 క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వారని, దీనిపై రూ. 33లక్షల 28 వేల 769 జరిమానా విధించినట్లు తెలిపారు.
2019-22 మధ్యకాలంలో జరిగిన అక్రమ మైనింగ్‌పైనా కఠిన చర్యలు చేపట్టామన్నారు. రహదారులు, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు గ్రావెల్ కోసం సుద్దపల్లిలో 4 క్వారీలకు అనుమతించినట్లు చెప్పారు. అయితే అనుమతులు లేకుండా 56 వేల 834 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినట్లు తేలిందని.. బాధ్యులపై రూ. 2 కోట్ల 6లక్షల 63వేల జరిమానా విధించామని ప్రకటించారు.
గనులశాఖ నివేదికపై స్పందించిన పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్య.. గత ప్రభుత్వ హయాంలోనే అక్రమ తవ్వకాలు జరిగినట్లు తేలిందన్నారు. తనపై ఆరోపణలు చేసిన ధూళిపాళ్ల నరేంద్ర బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అక్రమ మైనింగ్ చేసింది వైకాపా నాయకులేనన్న ధూళిపాళ్ల.. అందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మైనింగ్ వెంటనే ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
"అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాను. మళ్లీ మైనింగ్ జరగకుండా స్థానికులతో కమిటీ వేస్తామని అధికారులు తెలిపారు. ఒకవేళా అధికారులు తమ హామీలు విస్మరిస్తే ఇలాంటి పోరాటాలు మళ్లీ చేస్తా." - ధూళిపాళ్ల నరేంద్ర, తెదేపా సీనియర్ నేత
ఇదీ చదవండి
అక్రమ మైనింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు.. దీక్ష విరమించిన ధూళిపాళ్ల