గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పంచాయతీ రాజ్ అవార్డుకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలందించడంలో మెరుగైన పనితీరును కనపరిచిన మండలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సౌశక్తి కిరణ్ పురస్కార్ అవార్డులు ఇస్తుంది.
ఈ ఏడాది మేడికొండూరు మండలానికి ఈ అవార్డు దక్కింది. తాగునీరు, మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్త విధానాలు, ఈ గవర్నెన్స్ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలు వంటివి పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తుంది.అలానే ఈ ఏడాది కూడా ప్రకటించింది.
ఈ సందర్భంగా మేడికొండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శోభారాణి మాట్లాడుతూ 2019- 2020 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ ఖర్చులు మార్చి 31వ తేదీ నాటికి పంచాయతీ రాజ్‌కు సంబంధించిన ప్రియా సాఫ్ట్‌వేర్‌లో ఆన్లైన్లో నమోదు చేశామని తెలిపారు. 2020- 2021 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిధుల ప్లాన్ సాఫ్ట్‌వేర్‌లో మే నెలలో పూర్తిచేశామని తెలిపారు. అంతేకాకుండా పంచాయతీ రాజ్ పరిధిలో ఉండే 29 శాఖల పనితీరు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంలో ముందున్నామని తెలిపారు. అవార్డు దక్కటానికి సహకరించిన సిబ్బందికి శోభారాణి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి: నాన్నకు ప్రేమతో... వినూత్నంగా కళాకారుడి శుభాకాంక్షలు