మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ అమరావతి ప్రజలు చేస్తున్న నిరసనలకు పలు రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు సంఘీభావం తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. పార్టీల నేతలు, న్యాయవాద, వైద్య, విద్యార్థి, ఇతర సంఘాల ప్రతినిధులు రైతులు నిర్వహించిన నిరసనల్లో పాల్గొంటున్నారు. అమరావతిని కొసాగించాలని మచిలీపట్నంలో నేటి నుంచి నిరసనలు నిర్వహిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో 23 నుంచి 27 వరకూ విధులను బహిష్కరిస్తామని గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్రబాబు తెలిపారు. 27న భవిష్యత్ కారాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ర్యాలీగా వెళ్లి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణును కలిసి వినతిపత్రాలు అందిస్తామని అమరావతి పరిరక్షణ సభ్యులు చెప్పారు.
విజయవాడలో ఒకరోజు నిరాహాదీక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ నేతలు తెలిపారు. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, సిద్ధార్థ, లయోలా కళాశాలల వాకర్స్ అసోసియేషన్లు, బిల్డర్స్ సంఘం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ నిరసనలకు మద్దతు పలికాయని ఐకాస నేత సుధాకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి తెలిపారు. రైతుల పోరాటంలో భాగస్వాములమవుతామని గుంటూరుకు చెందిన నందకిషోర్ నేతృత్వంలోని వైద్య బృందం ప్రకటించింది.
ఇదీ చూడండి