Quarterly tax on transport vehicles: రవాణా వాహనాలపై త్రైమాసిక పన్ను పెంపును ఉపసంహరించాలని లారీ యజమానులు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. లారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ.. న్యూ ఆంధ్రామోటార్ అండ్ ట్రక్కర్స్ ఆసోషియేషన్ ఆధ్వర్యంలో ట్రక్కుల యజమానులు, డ్రైవర్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సమస్యలపై మరోసారి స్పందనలో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించగా అధికారులు తీసుకోలేదు. ఈ నెల 13న ఇదే అంశంపై వినతి పత్రం ఇచ్చినందుకు.. ఇప్పుడు వాళ్లు తీసుకోమని చెప్పినట్లు లారీ యజమానులు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో ప్లకార్డులు చేతపట్టి, నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
సంక్షోభంలో కూరుకుపోయిన లారీ పరిశ్రమను కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. కష్టాల్లో కూరుకుపోవడంతో యజమానులు, డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని అన్నారు. మా పరిస్ధితిని అర్ధం చేసుకుని సరకు రవాణా వాహనాలపై పన్ను పెంపుదల వెంటనే నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు. రవాణా రంగంలో సమస్యలను పరిష్కరించేలా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్రైమాసిక పన్ను పెంపుదలపై ఇచ్చిన నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు తెలిపే గడువు రేపటితో ముగుస్తున్నందున సీఎం జగన్‌కు తమ కష్టాలు చెప్పుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు లారీ యజమానలు తెలిపారు.
పన్నుల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించాలని ప్రతి వారం రవాణా శాఖ మంత్రి, కార్యదర్శి, కమిషనర్‌కు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము.. కాని వారి నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు. తమ కష్టాలు చెబుదామంటే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో స్పందనలో సీఎంను లేదా అధికారులను కనీసం కలవనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ స్పందించి లారీ పరిశ్రమను కాపాడేలా వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
రవాణా శాఖ నుంచి రవాణా రంగానికి సంబంధించి త్రైమాసిక పన్నును ఈ నెల 28 లోగా పెంపుదలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని గత నెల మొదట్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ రోజు నుంచి రవాణా రంగం పరిస్థితిని పరిశీలించి.. సమస్యలపై చర్చించి పరిష్కారానికి మార్గాలు చూపించండి ఆ తరువాతనే పెంపుదలని పెట్టండి అని నెల రోజులుగా వినతి పత్రాలు ఇస్తున్నాం. 13వ తారీకున మేము సీఎం గారిని కలవాలని.. స్పందన కార్యక్రమం ద్వారా ఇచ్చిన వినతి పత్రం వారికి ఇవ్వడం జరిగింది.- టీవీ చలపతిరావు, మోటార్ అండ్ ట్రక్కర్స్ ఆసోషియేషన్ సెక్రటరీ
ఇవీ చదవండి: