లాక్డౌన్ కారణంగా.. అన్ని రంగాలతోపాటు కళారంగం చిన్నబోయింది. కళలపైనే అధారపడిన వేలాదిమంది నిరుపేదలు.. ఇప్పుడు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నాటకాలు, నాటికలు, పౌరాణిక, జానపద కళారూపాలు, బుర్రకథలు.. ఇలా అన్నిరంగాల కళాకారులు కరోనా దెబ్బకు కుదేలయ్యారు. బయట ఎక్కడా ప్రదర్శనకు అవకాశం లేక ఇళ్లల్లోనే పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. గుంటూరు జిల్లాలో వేలాదిమంది కళాకారులుండగా... ఎవరికీ ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది.
ప్రదర్శనలు ఇస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. మరికొందరు ఉన్నదాంట్లోనే సర్దుకుంటున్నారు. వీరంతా పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కళను నమ్ముకున్నవారే. ఓ విధంగా చెప్పాలంటే.. అదే వారి ఏకైక జీవోనోపాధి. వారి పిల్లలూ ఇదే బాటలో నడుస్తున్నారు. కనీవినీ ఎరుగని కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ప్రభావం వారి జీవితాల్లో అంతులేని ఆవేదన మిగిల్చింది. ప్రభుత్వం చేస్తున్న సహాయం సరిపోక.. సంపాదన లేక.. వారి బతుకు కష్టాల కడలిలో చిక్కుకుంది.
ఈ కళాకారుల్లో కొందరు గత ప్రభుత్వ హయాంలో... కళాజాతలు నిర్వహించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో భాగం పంచుకున్నారు. వాటి కోసం అప్పులు చేసి మరీ వస్త్రాలు, మేకప్ కిట్లు కొని ప్రదర్శనలు చేశారు. ఆ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. ఆ బకాయిలను ప్రభుత్వం చెల్లించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వాటికి తోడు.. ఇప్పుడు ఎలాంటి ప్రదర్శనలూ లేవని.. తమకూ సంక్షేమాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరోనా, లాక్ డౌన్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత ప్రదర్శనకు తమకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: