గుంటూరు జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడంతో మొత్తం మీద ఆఖరి విడతలో పోలింగ్ 84.92 శాతం నమోదైంది. గుంటూరు డివిజన్‌లో పలు గ్రామాలకు చెందినవారు నగరంలో ఉండటంతో ఉదయం పది గంటలకు ఆయా గ్రామాలకు చేరుకొని ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓటర్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని వార్డులో ఎక్కువ ఓట్లు ఉన్నచోట అధికారులు వార్డును ఏ, బీ విభాగాలుగా విభజించడంతో ఓటర్లు బారులు తీరి వేచిచూడకుండా వచ్చిన వెంటనే ఓటు వేసి వెళ్లిపోయారు. ప్రత్తిపాడు పోలింగ్ కేంద్రంలో ఒకే ఆవరణలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండటం, ఓటర్లకు కనిపించేలా వార్డుల సూచికబోర్డులు లేకపోవడం కూడా గందగోళానికి కారణమైంది.
నడిచేందుకు ఓపిక లేకున్నా..
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. దీనిని గుర్తించిన వృద్ధులు ఆరోగ్యం సహకరించకపోయినా... నడవలేని పరిస్థితిలో ఉన్నా కుటుంబసభ్యులు, బంధువుల సాయంతో కేంద్రాలకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈక్రమంలో కొన్నిచోట్ల పోలీసులు వృద్ధులు వచ్చిన వెంటనే ఓటు వేసేలా సహకరించారు. పండు ముదుసలి వయసులోనూ పలువురు వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
గుంటూరు వాసుల ఆసక్తి:
డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందినవారు వివిధ వృత్తులు, వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం గుంటూరు నగరంలో నివాసం ఉంటున్నారు. అయితే వీరందరికీ సొంత గ్రామాల్లో ఓట్లు ఉన్నాయి. వీరందరూ ఆదివారం ఉదయాన్నే కుటుంబసమేతంగా గ్రామాలకు వెళ్లి ఓట్లు వేసి వచ్చారు. వీరందరూ ఎప్పటికప్పుడు గ్రామంలోని స్నేహితులకు ఫోన్లు చేసి ఫలితాలు కనుక్కోవడానికి ఆసక్తి చూపారు. గుంటూరు పరిసర మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలపై ఆదివారం నగరంలో విస్తృతమైన చర్చ జరిగింది.
ఇదీ చదవండి: శ్రీనగర్ నౌగామ్‌లో ఐఈడీ కలకలం!