చెదురుమదురు ఘటనలు మినహా.. గుంటూరు జిల్లాలో 4వ విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల సమయానికి జిల్లాలో 41.25 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 60 శాతం నమోదైంది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఎస్సీ కాలనీ పోలింగ్ బూత్ లో ఇద్దరు ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది. కుర్చీలతో పరస్పరం కొట్టుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు. వీరిని సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పలు చోట్ల స్వల్ప వివాదాలు తలెత్తినప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద వయోవృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు పోలీసులు సహకరిస్తున్నారు. జిల్లాలో 239 కేంద్రాల్లో పోలింగ్ సాఫీగా కొనసాగుతోంది. నిన్న జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో గట్టి బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ షామియానాలు వేసి తాత్కాలిక పోలింగ్ బూతును ఏర్పాటు చేసి పోలింగ్ చేపడుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం