గుంటూరు జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు అవసరమైనంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆర్బీకేలు, డీసీఎంఎస్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ప్రభుత్వం తరఫున అమ్మకాలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. అయినా మార్కెట్‌లో యూరియాకు డిమాండ్ ఉందన్న ప్రచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు డీలర్లు కొందరు గరిష్ఠ చిల్లర ధర కంటే అధికంగా విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, యూరియా ఆర్బీకేలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లో బస్తా రూ.266.50కే లభిస్తుండటంతో రైతులు కాంప్లెక్స్ ఎరువుల బదులు యూరియా ఎక్కువగా వాడుతున్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. దీంతో క్షేత్రస్థాయిలో ఆర్బీకేల వారీగా అవసరాల మేరకు సరఫరా చేస్తున్నా కొరత వెంటాడుతోంది.
సరకు లేదని చెప్పి..
జిల్లాకు వచ్చే ఎరువుల్లో 50 శాతం మార్‌్్కఫెడ్‌కు సరఫరా చేస్తుండగా, మరో 50 శాతం ప్రైవేటు డీలర్లకు సరఫరా చేస్తున్నారు. టోకు వ్యాపారుల నుంచి ప్రైవేటు డీలర్లకు యూరియా సరఫరా చేయడానికి మధ్యవర్తులు ఉంటారు. ప్రైవేటు డీలర్లకు ఆయా కంపెనీలు రవాణా ఛార్జీలు ఇవ్వకపోవడంతో రవాణా, ఎత్తుడు, దించుడు కూలీలు ప్రైవేటు వ్యాపారులపైనే పడుతోంది. దీంతో వారు యూరియాను గరిష్ఠ చిల్లర ధరకు విక్రయిస్తే నష్టం వస్తుందని కొనుగోలుకు ముందుకు రావడం లేదు. ఈక్రమంలో అవసరాలకు సరిపడా అందుబాటులో లేదన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది వ్యాపారులు సరకు అందుబాటులో లేదని, అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
రబీ సీజన్ అవసరాలు 43 వేల టన్నులే
జిల్లాలో రబీ సీజన్‌లో 54759 హెక్టార్లలో మొక్కజొన్న, జొన్న 29438, వరి 19610 హెక్టార్లలో సాగయింది. వ్యవసాయశాఖ సిఫార్సుల మేరకు మొత్తం 43వేల మెట్రిక్ టన్నులు యూరియా సరిపోతుందని అంచనా. ఇప్పటివరకు రబీ సీజన్‌లో జిల్లాకు 59636 టన్నుల యూరియా సరఫరా అయింది. ఇందులో 24687 టన్నులు ప్రైవేటు డీలర్లకు సరఫరా చేయగా మిగిలినది మొత్తం ఆర్బీకేలు, డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించారు. అవసరాల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కొరత వెంటాడుతోంది. మొక్కజొన్న, జొన్నకు ఎకరాకు 96 కిలోల నైట్రోజన్ సరిపోతుంది. ఈ లెక్కన ఎకరాకు 4 బస్తాలు వేయాలి. అయితే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర సగటున రూ.1500 వరకు ఉండటంతో రైతులు వాటిని కొనుగోలు చేయలేక ప్రత్యామ్నాయంగా యూరియా వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో సగటున ఎకరాకు 8 బస్తాల వరకు చల్లుతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే మూడో డోసుకు సరిపడా యూరియా నిల్వ చేసుకోవడం కూడా కొరతకు కారణమని చెబుతున్నారు.
" రబీ సీజన్ సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందకుండా అవసరాల మేరకు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉండవు. పది రోజుల తర్వాత చల్లేవారు కూడా ఇప్పుడే కొనుగోలు చేసి పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఆర్బీకేల వారీగా సమీక్షించి అందుబాటులో ఉంచాం." - విజయభారతి, సంయుక్త సంచాలకులు, వ్యవసాయశాఖ
తూర్పుగోదావరి జిల్లాలో ఎరువుల కొరత
కరప రైతు భరోసా వద్ద యూరియా, డీఏపీ కోసం నిరీక్షిస్తున్న రైతులు
తూర్పుగోదావరి జిల్లాలో ఎరువుల కొరత రైతులను కలవరపెడుతోంది. ఖరీఫ్‌లో విపత్తులు వెంటాడితే.. దాళ్వాకు ముందేఇబ్బందులే ఎదురవుతున్నాయి. రబీలో వరి నాట్లు పూర్తయి పిలకల దశలో ఉన్న చేలకు ఎరువుల అవసరం ఉంది. తగినన్ని నిల్వలు లేక.. ఆర్బీకేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో తగినన్ని నిల్వలు ఉన్నాయని వ్యయసాయ శాఖ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి, ప్రధానంగా డీఏపీీ, యూరియా దొరక్క ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత దశలో ఎరువులు తగు మోతాదులో వాడకపోతే దుబ్బు కట్టక దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు కలత చెందుతున్నారు.
ఇప్పుడే కీలక సమయం
రబీలో 1,68,904 హెక్టార్లలో సాగు చేశారు. దాదాపుగా నాట్లు పూర్తయ్యాయి. పంట పిలకల దశలో ఉంది. పంట దుబ్బు చేయాలంటే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు వాడాలి. ప్రభుత్వం ఆర్బీకేలు, సొసైటీలు, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎరువులను అందుబాటులో ఉంచినట్లు చెబుతోంది. వాస్తవానికి దాళ్వాకు 2.14 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఇప్పటికి 84,587 మెట్రిక్ టన్నులే వచ్చాయి.మరో 42,017 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ ఏజెన్సీల వద్ద ఉన్నట్లు (ఇందులో 4,389 యూరియా) అధికారులు చెబుతున్నారు. క్షేత్రంలో ఇందుకు భిన్నంగా ఉంది. రోజంతా పడిగాపులు కాసినా ఒక్క బస్తా దొరకటం గగనమే అవుతోంది.
జిల్లాకు 5,200 మెట్రిక్ టన్నుల రాక
రైతు భరోసా హబ్‌లలో అన్ని రకాల ఎరువులు కలిపి 4,913 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉన్నాయి. అందులో యూరియా 1,818 మెట్రిక్ టన్నులు ఉంది. ద్వారపూడి రైల్వేస్టేషన్ ర్యాక్ పాయింట్‌కు బుధవారం ఎన్‌ఎఫ్‌సీిఎల్‌కు చెందిన 5,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. రైతులకు అవసరాన్ని బట్టీ మరింత యూరియా కేటాయిస్తున్నట్లు జేడీఏ విజయకుమార్ తెలిపారు.
తప్పని అదనపు భారం..
ఎరువులను ఆర్బీకేలు, సొసైటీల్లో విక్రయిస్తున్నారు. అక్కడ రొక్కం చెల్లించి కొనాలి.అయినా తగినంత ఎరువులు దొరక్కకొందరు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.వీరిలో కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.పైగా ప్రైవేటు ఏజెన్సీల వారు పురుగు మందులు, గుళికలు కొంటేనే ఎరువులు ఇస్తామని లింకు పెడుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. గత్యంతరం లేక గుళికలు కొనాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల విక్రయాలకు సైతం ఆధార్ లింక్‌ను పెట్టారు. అయినా అక్రమాలు సాగుతూనే ఉన్నాయి.
డీఏపీ కొనాల్సిందే..!
యూరియా, డీఏపీ బస్తాలతో రైతు
సీతానగరం: ఈయన... రాపాక రైతుచుండ్రు వీరేంద్ర. మొక్కజొన్న సాగు చేశారు. సొసైటీకి ఎరువులు రాకపోవడంతో ఆర్‌బీకే చుట్టూ తిరిగినా బస్తా యూరియా దొరకలేదు. బుధవారం రఘుదేవపురంలోనే ఓ ప్రైవేటు దుకాణానికి వెళ్లి యూరియా అడిగితే ప్రభుత్వ ధర రూ.266.50కు బదులు రూ.320 చెప్పారు. అంత ధర చెల్లించినా.. అదనంగా డీఏపీ కాంప్లెక్స్ బస్తా రూ.1,360 పెట్టి కొంటేనే ఒక బస్తా యూరియా ఇస్తామన్నారు. తప్పక.. ఆ రైతు రెండు రకాల ఎరువులు కొన్నారు.అవసరం లేకపోయినా.. డీఏపీ తీసుకున్నాననీ,పంట పూర్తయ్యేసరికి 10 బస్తాల యూరియా అవసరమని.. ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఏడీఏ బీకే మల్లికార్జునరావు వివరణ కోరగా.. ప్రభుత్వం ధరకే రైతు కోరిన ఎరువు ఇవ్వాలనీ.. ఇలా అంటగట్టే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సాగు చేసేదెలా?
రబీ సాగుకు అవసరమైన యూరియా, డీఏపీలను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రైతు భరోసా కేంద్రాలకు అరకొరగా సరఫరా చేసి చేతులు దులుపుకొంటున్నారు. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. భూమి పత్రాలు, ఆధార్ కార్డు తీసుకెళ్తే ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. మూడున్నర ఎకరాలు సాగుకు ఒక బస్తా ఎలా సరిపోతుంది. దీని కోసం పనులు మానుకొని రోజంతా పడిగాపులు కాయాల్సి వస్తోంది. నాట్లు పూర్తయిన తరువాత సమయం మించిపోతున్నా ఇప్పటి వరకు మొదటి దఫా ఎరువులు వేయలేదు. సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి. -యాళ్ల త్రిమూర్తులు, రైతు, కరప
ఇదీ చదవండి: 'చలో విజయవాడ'పై ఉక్కుపాదం... ఉద్యోగ, ఉపాధ్యాయుల గృహనిర్బంధం