Electric Vehicles in Andhra Pradesh: రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల వినియోగం పెంచాలన్న లక్ష్యం అంతగా విజయవంతం కాలేదు. కానీ విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామనే పేరుతో పైసా ఖర్చు లేకుండా.. ప్రచారం చేయటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యుత్తు వాహనాల వినియోగానికి ప్రోత్సాహం.. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందించడం వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశమే లేదు. ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి.. వాటి ద్వారా అందుబాటులోకి వచ్చేలా సమన్వయం చేస్తే చాలు. కానీ, ఇలా చేయాటానికి ప్రభుత్వానికి రెండు సంవత్సరాలుగా సాధ్యం కావటం లేదు. ఫలితంగా రాష్ట్రంలో 500 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలు.. అర్బాటాలుగా మిగిలిపోయాయి.
మౌలిక సదుపాయాలు ఉంటేనే ఈవీలు కొనే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ద్విచక్ర వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు మాత్రమే అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి.ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వం రాయితీలేవీ ఇవ్వడం లేదు. ఛార్జింగ్ చేస్తే యూనిట్ విద్యుత్తుకు 20 చొప్పున వసూలుకు అనుమతించగా, ఇందులో టారిఫ్ 10రూపాయలు, స్థలం అద్దె, ఇతర ఖర్చులకు 3 రూపాయల వ్యయమవుతోంది. దీంతో కేంద్రం నిర్వాహకులకు మిగిలేది 7 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు వాహనాలు తక్కువ సంఖ్యలో ఉండడంతో.. ఆదాయం రాదనే కారణంతో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
ఈవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉద్యోగులకు ఏడాదిలో లక్ష విద్యుత్తు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం 2021 జులైలో ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. పథకం అమలు, పర్యవేక్షణ బాధ్యతను నెడ్‌క్యాప్‌కు అప్పగించింది. వాహన కొనుగోలు మొత్తాన్ని 24 నుంచి 60 వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది. ప్రతి నెలా పెట్రోలుకయ్యే వ్యయంతో పాటు వాయిదా చెల్లించవచ్చని ప్రచారం చేసింది. ఈ పథకాన్ని అమలుచేయటానికి నెడ్‌క్యాప్ ప్రత్యేకంగా యాప్ రూపొందించి అప్పట్లో నానా హైరానా చేసింది. తక్కువ వడ్డీతో రుణం అందించేలా బ్యాంకులతో కూడా సంప్రదింపులు జరిపింది. ఇంత చేసి చివరకు వంద వాహనాలకు మించి ఇవ్వలేదు.
విద్యుత్తు వాహనాల కొనుగోలుదారులకు కేంద్రం, రాష్ట్రం షాకిచ్చాయి. విద్యుత్తు వాహనాల కొనుగోలుపై కేంద్రం రాయితీని తగ్గిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జీవితపన్ను మినహాయింపును తొలగించింది. దీంతో వాహనాల ధరలు భారంగా మారాయి. విద్యుత్తు వాహనాల కొనుగోలులో కేంద్రం ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ -2 పథకం కింద 2018 నుంచి అయిదేళ్లపాటు 15 నుంచి 40 శాతం రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి 15 శాతానికి పరిమితం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈవీల రిజిస్ట్రేషన్‌లో 2018 నుంచి అయిదేళ్లపాటు 12 శాతం జీవితపన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 7వ తేదీతో ముగిసింది. మినహాయింపు కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని రవాణాశాఖ కోరినా సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో జూన్ 8 నుంచి విద్యుత్తు వాహనాల రిజిస్ట్రేషన్‌కు జీవిత పన్ను వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 60 వేల ఈవీలు ఉండగా, ఏటా సగటున 20 వేల కొత్త ఈవీల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా బైక్‌లే ఉంటున్నాయి.
రాష్ట్రంలో జాతీయ రహదారి వెంట ప్రతి 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 250 విద్యుత్తు ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.....2023 సంవత్సరంలో నగరాల్లో ద్విచక్ర వాహనాల కోసం మరో 250 ఛార్జింగ్ కేంద్రాలను తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వచ్చే ఏడాది మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అంటోంది. కానీ ప్రభుత్వం చెప్పినట్లు జాతీయ రహదారి వెంట ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన అడుగు ముందుకు పడలేదు. జాతీయ రహదారుల వెంట ప్రతి 100 కిలో మీటర్లకు ఒక ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేసినా.. విద్యుత్తు వాహనాల్లో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుంది. ఈమేరకు సంప్రదింపులు జరపగా.. గత రెండేళ్లుగా ఏవీ కార్యరూపం దాల్చలేదు.