Village Clinics: ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే విలేజ్ క్లినిక్లలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు చెప్పారు. ఏప్రిల్ 6 తర్వాత ప్రారంభించనున్న విలేజ్ క్లినిక్లలో ఒక వైద్యుడు, స్టాఫ్ నర్సింగ్, ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విలేజ్ క్లినిక్ వైద్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 10,032 మంది సిబ్బందిని ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఏర్పాటు చేసి.. వారికి అన్ని ఆరోగ్య అంశాలపై వారికి వివరంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇప్పటికే పది మంది వైద్యులు దిల్లీ వెళ్లి శిక్షణ తీసుకున్నారని, ప్రతి జిల్లా నుంచి నలుగురు చొప్పున 104 మందిని ఇక్కడికి తీసుకు వచ్చి శిక్షణ తీసుకున్న డాక్టర్లతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ట్రైనింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆర్ఆర్బీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తరహాలోనే వైద్యశాఖలోని ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తామని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన జీవో మరో రెండు రోజుల్లో వస్తుందని కృష్ణ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ నివాస్ కూడా పాల్గొన్నారు.
"ప్రతి గ్రామంలో హెల్త్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్‌లను పెట్టాము. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 10,032 మంది సిబ్బందిని ప్రతి విలేజ్ క్లినిక్‌లో ఏర్పాటు చేశాము. కంటి సమస్యలు, వినికిడి లోపం, గర్భిణీల్లో ఆరోగ్య సమస్యలు, అనీమియా వంటి అంశాలపై వారికి వివరంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పటికే 10 మంది వైద్యులు దిల్లీ వెళ్లి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు. ప్రతి జిల్లా నుంచి నలుగురు చొప్పున 104 మందిని ఇక్కడికి తీసుకుని వచ్చాము. ఇప్పడు వారికి ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్లతో శిక్షణ ఇప్పిస్తున్నాము. ఈ ట్రైనింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. ఇప్పటికే ప్రతి గ్రామ సచివాలయంలో 67 రకాల మందులను అందుబాటులోకి తీసుకుని వచ్చాము. ఈ నెలాఖరులోగా విలేజ్ క్లినిక్‌ల ద్వారా 105 రకాల మందులను అందుబాటులోకి తీసుకుని రానున్నాము." -ఎంటీ కృష్ణ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి