TDP Supporters Protest Against Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ... ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు కోస్తాంధ్ర వ్యాప్తంగా నిరసనల గళం విప్పారు. ప్రధాన కూడళ్లలో దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో టీడీపీ(TDP) నాయకులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. పామర్రులో నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని నిరసనలు చేశారు. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరులో నిరసన చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సత్తెనపల్లిలో స్థానిక తెలుగుదేశం నేతలు చంద్రబాబు అరెస్టును(Chandrababu Arrest) నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిరసనగా దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో రెండో రోజు నిరసన కొనసాగుతుంది. క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తిని గవర్నర్ అనుమతితో అరెస్టు చేయాల్సి ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండానే కక్షపూరిత చర్యలకు పరాకాష్టగా నిలుస్తుందని ఆయన మండిపడ్డారు.
గుంటూరు జిల్లా తాడికొండ అడ్డ రోడ్డులో తెలుగుదేశం నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నల్ల కండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్(CM Jagan) ప్రతిపక్షాల మీద అన్యాయంగా కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటున్నారని గుంటూరు పట్టణ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆగ్రహించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం సీఎం జగన్ సైకోయిజానికి నిదర్శనమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు బస్టాండ్ వద్ద నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.
పొన్నూరు ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద తెలుగుదేశం శ్రేణులు నిరాహారదీక్షకు దిగారు. బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ అవరణలో... టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో... చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. నెల్లూరు టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆత్మకూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు బైటాయించారు. నిరాహార దీక్ష చేస్తున్న ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.