E bike designed by Karimnagar student : వాహనరంగంలో నూతన ఆవిష్కరణ చేయాలని బాల్యం నుంచి తన కల. తగ్గట్లుగానే విద్యాభ్యాసం సాగింది. చిన్ననాటి నుంచి తన కలల సౌధాలు నిర్మించుకున్నాడు. అక్కడితో ఆగి పోలేదు. ఎంతో కృషి చేసి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన యువ ఇంజనీర్ తన ఆశయం నెరవేర్చుకున్నాడు. మరి తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు.. ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. వాటిని ఎలా అధిగమించాడో ఓసారి తెలుసుకుందామా..?
కరీంనగర్ జిల్లా ముంజంపల్లికి చెందిన కాసం వెంకట్ రెడ్డి తనయుడు కాసం అఖిల్ రెడ్డి. చిన్ననాటి నుంచి వాహనరంగం అంటే విపరీతమైన మక్కువ. తన ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సీటీలో ఇంజనీరింగ్ పట్టా పొందిన అఖిల్ చిన్నప్పటి నుంచి ఉన్న తన కల నెరవేర్చుకునే దిశగా అడుగులేశాడు.
నూతనంగా తయారు చేయడానికి అడ్డంకులుగా ఉన్న కారణాలు దృష్టిలో ఉంచుకుని పాత బైక్‌నే వాడుకున్నాడు. పలు లెక్కలేసుకుని దీని తయారీకి అహోరాత్రులు శ్రమించి 3 రోజుల్లో వాహనం తయారుచేశాడు. పాత వాహనాన్ని మాడిఫికేషన్ చేయడం వల్ల తనకున్న అంచనాల ప్రకారం కాక కాస్త తక్కువ స్పీడ్ చేరుకుంటుందని అంటున్నాడు ఈ యువ ఇంజనీర్.
బీటెక్ అంటే సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు.. ఇంజినీరింగ్ అంటే సాఫ్ట్‌వేర్ మాత్రమే అన్నట్టుగా పరుగులు తీస్తున్న యువతరంలోనూ ప్రత్యేకతను చాటుకోవడానికి తన అభిరుచినే ఆయుధంగా చేసుకున్నాడు అఖిల్. ఆటోమొబైల్ విభాగంలో పట్టా పొందిన ఈ కరీంనగర్ కుర్రోడు ఇప్పుడు వస్తున్న వాహనాలు సరిగా లేవంటాడు. వాటికంటే ఎలక్ట్రిక్ వాహనాలే బెటర్ అంటూనే తను తయారుచేసిన వాహన ప్రత్యేకతలు వివరిస్తున్నాడు.
ఈ వాహనం పూర్తిగా బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వేడి ఉత్పత్తి అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తాను తయారు చేసే సమయంలో టెఫ్లాన్ షీట్లు వాడినట్టు చెప్తున్నాడు అఖిల్. దానివల్ల ఎక్కువగా ఉత్పత్తైన వేడిని తగ్గిస్తుందని చెప్తున్నాడు. తన వాహన తయారీకి వాడిన పరికరాలు, వాహన పనితీరు గురించి తన మాటల్లోనే విందాం.
"స్ప్లెండర్ బైక్‌ను ఈ-బైక్‌గా మార్చాను. 100 స్పీడ్ వరకు వెళ్తదని అనుకున్నా.. కానీ 70 వరకు వస్తోంది. ఛార్జింగ్ పెడితే 25 రూపాయలు పడుతుంది. నేను 5 గంటల ఛార్జర్‌ను తయారు చేశా.. దాంతో ఛార్జింగ్ పెడితే హీటింగ్ సమస్యలు వస్తున్నాయి. అందుకే బయట 9 గంటల ఛార్జర్ కొన్నాను. దాంతోటి ఛార్జింగ్ పెడితే రూ.25 పడుతుంది. ఈ బైక్‌ను నేను వేసవిలో కొండ ప్రాంతంలో 50 డిగ్రీల ఎండలో మూడ్రోజులు పెట్టాను ఎలాంటి సమస్యలు రాలేదు. అలాగే వానలో, చలిలో కూడా పెట్టాను ఏ సమస్యా రాలేదు. ఈ బైక్‌ను ఓ రెండేళ్లు వాడిన తర్వాత దీని పనితీరు చూసి ఇంకా కొన్నిమార్పులు చేసి ఆ తర్వాత మార్కెట్‌లోకి తీసుకొస్తాను." అని చెప్పుకొచ్చాడు అఖిల్.
రానున్న రోజుల్లో ఈ-వెహికిల్స్‌దే రాజ్యం.. రానున్న రోజుల్లో వాహనాలన్నీ ఈ వెహికిల్స్ అని అంటున్నాడు అఖిల్. రెండేళ్ల క్రితమే తన వాహన తయారీ పూర్తయినా దానిని మార్కెట్‌లోకి వదలలేదు. ఇంకా ఇంకా మెరుగుపరచడానికి ఆలోచన చేస్తున్నట్టుగా తెలిపాడు. తన ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సహకారమందిస్తే ఇంకా మెరుగైనవి తయారు చేయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఈ కరీంనగర్ కుర్రాడు.
అఖిల్‌కు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం వచ్చినా కూడా తన లక్ష్యాన్ని విడవకుండా నిత్యం దీనికే కట్టుబడి ఉన్నాడని బంధువులు అంటున్నారు. అందరూ వార్త పత్రికల్లో వార్తలు చూస్తే మనోడు మాత్రం అందులోని కార్లు, బండ్లు వాటిని ప్రత్యేకతలు పరిశీలించేవాడు. పిల్లల భవిష్యత్ కోసం ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుందంటున్నారు అఖిల్ తండ్రి వెంకట్ రెడ్డి.
మార్కెట్‌లో ప్రస్తుతం ఇటువంటి వాహనాల అవసరముందని తమ గ్రామస్థుడు తయారు చేసిన వాహనానికి సహకారం అందించాలని ముంజపల్లి వాసులు కోరుతున్నారు. వాహన తయారీ వల్ల అఖిల్ రెడ్డితో పాటు తమ గ్రామానికి కూడా పేరొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి :