రాష్ట్రంలో 108 సేవల నిర్వహణను అరబిందో ఫార్మాకు ఇవ్వటాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. భారత్ వికాస్ గ్రూపుతో గతంలో ఉన్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ సంస్థ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు నెలకు లక్షా 31 వేలు తీసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. 2018లో ఒప్పందం జరిగిందని... ఐదేళ్ల గడువున్నా ఎందుకు ఒప్పందం రద్దు చేసుకుని కొత్త సంస్థకు ఇస్తున్నారని లేఖలో ప్రశ్నించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు.
అరబిందో ఫార్మా ఫౌండేషన్.... అరబిందో ఫార్మా కంపెనీకి చెందినదేనని కన్నా వెల్లడించారు. అందులో రోహిత్ రెడ్డికి మెజారిటీ వాటాలున్నాయని వివరించారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు కొత్త అంబులెన్సుకు నెలకు 1,78,000, పాత వాటికి నెలకు 2,21,257 రూపాయలు చెల్లించటం ఏమిటన్నారు. తక్కువ వసూలు చేసే సంస్థను కాదని ఎక్కువ తీసుకునే సంస్థకు నిర్వహణ ఎందుకు ఇస్తున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపడమేనన్నారు. అందుకే అరబిందోతో ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి