AP HC New Chief Justice: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా (ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నియమితులయ్యారు. ఈ నియామకానికి మన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేయడంతో.. శుక్రవారం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ శేషసాయిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ.. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర నోటిఫికేషన్ జారీ చేసింది.
జస్టిస్ శేషసాయి నేపథ్యం: జస్టిస్ శేషసాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1962లో వ్యవసాయ, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించారు. భీమవరం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఆయన తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం పాఠశాల ఉన్నత విద్యను లూథరన్ హైస్కూల్లో చదివారు. ఆయన తన ఇంటర్మీడియట్ విద్యను కేజీఆర్ఎల్ కళాశాలలో, డిగ్రీను డీఎన్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎల్ అభ్యసించారు.
1987 జులై 3న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆయన.. పి.రాజగోపాలరావు, పి.రాజారావు ఆఫీసులలో చేరి వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. ఆయన సివిల్, క్రిమినల్, సర్వీసు, రాజ్యాంగ సంబంధ చట్టాలకు సంబంధించిన కేసుల్లో ప్రాక్టీసు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు. అతి కొద్ది కాలంలోనే సొంత ప్రాక్టీసు ప్రారంభించి అన్ని రకాల కేసుల్లో వాదనలు వినిపించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా, బార్ కౌన్సిల్‌కు ప్యానల్ న్యాయవాదిగా ఆయన పనిచేశారు.
ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వేసిన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఆయన తన విశేష సేవలు అందించారు. 2013 ఏప్రిల్ 12న ఏపీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా ఆయన ప్రమాణం చేశారు. 2014 సెప్టెంబర్ 8న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2019 జనవరి 1న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ప్రమాణం చేశారు. హైకోర్టు పరిపాలనా సంబంధ వ్యవహారాలు, న్యాయ సేవాధికార సంస్థలో వివిధ హోదాల్లో జస్టిస్ వెంకట శేషసాయి కీలక పాత్ర పోషించారు. సంస్కృతి, విద్యా, సంగీతం, ఫిలాసఫీ తదితర అంశాలపై కూడా ఆయనకు మక్కువ ఎక్కువ.
ఇవీ చదవండి: