పంచాయతి ఎన్నికల్లో గ్రామస్థాయిలో జనసేన పార్టీ జెండా ఎగరేసినట్లే.. రాష్ట్ర సచివాలయంలోనూ ఎగరేస్తామని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ మద్ధతుదారు అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొని ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పని చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
జనసేన తరపున విద్యావంతులు సర్పంచులుగా గెలవడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. నిరంతరం ప్రజలతో ఉంటూ.. పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని మనోహర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో.. అన్ని ప్రాంతాల్లో జనసేనకు ప్రజాదరణ ఉందనే విషయం స్పష్టమైందని వివరించారు. స్థానిక ఎన్నికల విజేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమవ్వనున్నారని తెలిపారు.