Nadendla Manohar on YSRCP Government: సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ పాలకుల తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల అగచాట్లు: పథకాలకు డబ్బులు లేవని తెలిసీ ముఖ్యమంత్రి బటన్లు నొక్కడం జనాన్ని మభ్యపెట్టడం కాక మరేంటని ప్రశ్నించారు. పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దివాళాకోరుతనం కారణంగా విద్యా దీవెన, వసతి దీవెన రాక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారని తెలిపారు.
ట్రిపుల్ ఐటీలతో అసలు విషయం బయటపడింది: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో అసలు విషయం బయటపడిందని చెప్పారు. ట్రిపుల్ ఐటీలకు చెందిన 4 వేల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయాయని.. బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని వివరించారు. ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు సైతం ఇలాంటి ఇక్కట్లే పడుతున్నారని తెలిపారు.
అగమ్యగోచరంగా విద్యార్థుల భవిష్యత్తు: ఉద్యోగాల్లో చేరే వాళ్లు, తదుపరి చదువులకు వెళ్లేవారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. ఈ వాస్తవాలు తెలిసి కూడా వైసీపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఉందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తక్షణమే పని చేసే బటన్లు నొక్కి బకాయిలు చెల్లించి విద్యార్థులు రోడ్డున పడకుండా చూడాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ విద్యార్థుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడుతుందని నాదెండ్ల మనోహన్ అన్నారు.
ప్రభుత్వం ఒక మాట.. అధికారులు మరో మాట: వర్షానికి ధాన్యం తడిసి.. రైతు వారం రోజులుగా కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శకి కూడా రాకుండా వైసీపీ నేతలు ఏం చేస్తున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ ప్రశ్నించారు. పోలీసులను ఇబ్బంది పెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచన జనసేన పార్టీ చేయదన్నారు. ముఖ్యమంత్రి ప్రతి గింజా కొంటామని అంటుంటే.. అధికారులు మాత్రం మేం కొనలేమని, ధాన్యం ఎలా అమ్ముకోవాలో రైతులకు సలహాలిస్తామని చెప్తున్నారని మండిపడ్డారు.
పరిపాలనలో ముఖ్యమంత్రి పాత్ర నామమాత్రమే అని.. అధికారులే పరిపాలిస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి డమ్మీ అని.. రైతుల పట్ల ఎంత చిత్తశుద్ది ఉందో ఆయన తీరుతో అర్థమౌతుందన్నారు. వైసీపీ నాయకులకు.. ఇసుక, గ్రావెల్, బూడిద దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎద్దేవా చేసారు.
ఇవీ చదవండి: