Jagananna Ammavodi Program: రాష్ట్రంలో పేదరికాన్నే కొలమానంగా తీసుకొని ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా చేస్తున్నామంటూ వైసీపీ సర్కార్ చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. విద్యార్థుల తల్లులకు అందించే అమ్మఒడి పథకమే దానికి నిదర్శనం. పిల్లల్ని బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు అమ్మఒడి కింద ఏటా 15వేలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను తప్పారు, మడమ తిప్పారు.
2020లో తొలిసారి 15 వేల రూపాయలు ఇవ్వగా, ఆ తర్వాత ఏడాది వెయ్యి రూపాయలు కోత వేశారు. 2022 నుంచి పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో దాన్ని రెండు వేలకు పెంచారు. అమ్మఒడి పథక లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కూడా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2021లో 44 లక్షల 48 వేల మందికి నిధులు జమ చేయగా, 2022కు ఆ సంఖ్యను 43 లక్షల 96 వేలకు తగ్గించేశారు. 75 శాతం హాజరు పేరుతో ఈ ఏడాది జూన్‌లో 42 లక్షల 61వేల మందికి మాత్రమే సాయం ఇచ్చారు.
2021లో తల్లుల ఖాతాల్లో 6 వేల 673 కోట్లు జమ చేయగా, ఈ ఏడాది జూన్‌లో 6 వేల 393 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే 280 కోట్లు మిగుల్చుకున్నారు. ఈ ఏడాది సాయం 13 వేలను కొంతమందికి రెండు, మూడు విడతలుగా వేశారు. అందులోనూ కొందరికి ఒకసారి 9వేలు వేయగా, మరికొందరికి 5 వేల రూపాయలే వేశారు. గత జూన్‌లో నిధుల విడుదలకు బటన్ నొక్కిన తర్వాత 15 రోజుల వరకు చాలా మందికి డబ్బులు జమ కాలేదు.
అమ్మఒడి సాయంలో కోత.. రూ.6,300 కోట్లు మిగుల్చుకున్న జగన్ సర్కారు..
అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు: పొరుగుసేవల ఉద్యోగులకు 15 వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ వారికీ జగన్ మార్కు షాక్ రుచి చూపించారు. వివిధ శాఖల్లోని పొరుగు సేవల ఉద్యోగులు సుమారు 2 లక్షల 40 వేల మంది ఉన్నారు. వీరి మేలు కోసమే ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌సోర్స్‌డ్ సర్వీసెస్‌ను తెచ్చినట్లు గొప్పలు చెప్పిన జగన్, ఇందులో చేరిన లక్ష మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు.
ఆప్కాస్ (Andhra Pradesh Corporation for Outsourced Services) పరిధిలో ఉన్నవారి వేతనాలను సీఎఫ్ఎంఎస్కు అనుసంధానించడంతో వారి వివరాలన్నీ రాబడుతూ పథకాలకు కోత వేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరిలోకి వచ్చినట్లేనని అధికారులు సమాధానమిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగు సేవల వారికి ఇస్తున్నారా అంటే అది కూడా లేదు.
విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25శాతం ప్రవేశాలు కల్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవేటు స్కూల్స్‌కి ఫీజులను నిర్ణయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే రీయింబర్స్‌మెంట్ చేయాలి. కానీ జగన్ సర్కారు మాత్రం అమ్మఒడి నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ఆదేశాలిస్తుంది. దీని కోసం ఏకంగా విద్యాహక్కు చట్టానికి సవరణ చేసింది. ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలనే నిబంధనను తొలగించింది. దీంతో ఈ కోటాలో చేరేవారికి ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఫీజులకూ సరిపోని పరిస్థితి ఏర్పడింది.
Ammavodi not credited: ఇంకా జమ కాని 'అమ్మఒడి' నిధులు.. బ్యాంకుల వద్ద ఎండలో పడిగాపులు
అనేక ఆంక్షలు విధిస్తూ: పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ప్రభుత్వం అమ్మఒడి సాయంలో 2వేల రూపాయలు మినహాయిస్తోంది. ఆ డబ్బుతో బడుల్లో నిర్వహణ చేపడుతుందా అంటే అదీ లేదు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం వాడేసుకుంటోంది. విద్యా సంవత్సరం ఇంకో నాలుగు నెలల్లో ముగుస్తుందనగా, ఇప్పుడు నాడు-నేడు మొదటి విడత పనులు చేసిన బడులు, మూడో విడతలో చేపట్టే వాటికి నిధులను ఇచ్చింది. వాటి వినియోగానికి కూడా ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది.
2019-20లో జమ చేసిన 15వేల రూపాయల్లో వెయ్యి రూపాయలు నిర్వహణకు ఇవ్వాలని లబ్ధిదారులను ప్రభుత్వం ఆదేశించింది. చాలా చోట్ల ప్రధానోపాధ్యాయులే ఆ మొత్తాన్ని వసూలు చేసి మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేశారు. ఇవ్వని వారి నుంచి 2020-21లో ప్రభుత్వమే వెయ్యి రూపాయలు మినహాయించుకుంది.
రెండు వేల రూపాయల కోత: ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి 2 వేల రూపాయల కోత వేస్తున్న ప్రభుత్వం, ఆ మొత్తాన్ని యాజమాన్యాలకు ఇవ్వడం లేదు. నిర్వహణ పనుల బాధ్యతను యాజమాన్యాలే చూసుకోవాలని ఉచిత సలహాలిస్తోంది. తమ పాఠశాలల విద్యార్థులకు అందే సాయం నుంచి మినహాయిస్తున్నందున ఆ నిధులు తమకే తిరిగివ్వాలని ఎయిడెడ్ సంస్థలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
జగన్ సర్కారు కొత్త ఎత్తుగడ: అమ్మఒడికి సంబంధించి ఒక ఏడాది నిధులను మిగుల్చుకునేందుకు జగన్ సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. 75శాతం హాజరు నిబంధనతో ముందు ఏడాది హాజరు ప్రాతిపదికన సాయం జమ చేస్తోంది. మొదటి రెండేళ్లు జనవరిలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, 2021-22లో 75శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్‌లో డబ్బులు వేసింది. 2022-23కీ అదే లెక్కన గత జూన్‌లో జమ చేశారు. వచ్చే సంవత్సరం జూన్‌లో మళ్లీ సాయం ఇచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తుంది.
దీంతో వైసీపీ పదవీ కాలం అయిదేళ్లలో నాలుగు పర్యాయాలు మాత్రమే ఇచ్చినట్లవుతుంది. ఈ లెక్కన ఒక ఏడాది నిధులు 6 వేల 3 వందల కోట్లను ప్రభుత్వం మిగుల్చుకుంది. లబ్ధిదారులు కోరుకుంటే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు అమ్మఒడి నగదు సాయం బదులు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని 2021 జనవరి 11న సీఎం జగన్ ప్రకటించారు. ల్యాప్‌టాప్‌లు వస్తే ఉన్నత చదువులకు ఉపయోగపడతాయని విద్యార్థులు ఆశపడ్డారు.
దాదాపు 7లక్షల మంది డబ్బులకు బదులు ల్యాప్‌టాప్ కావాలన్నారు. వీటికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కానీ ధరలు ఎక్కువగా ఉన్నాయని వెంటనే రద్దు చేసింది. గుత్తేదార్లు ఒక్కో ల్యాప్‌టాప్‌కు 26 వేల రూపాయలు కోట్ చేయడంతో, అదనంగా ఒక్కో దానికి 13 వేలు భరించాల్సి వస్తుందని ప్రభుత్వం చేతులెత్తేసింది. నిజంగా పేదలపై అంత ప్రేమే ఉంటే అదనపు భారం పడుతుందని హామీని గాలికి వదిలేస్తారా? ప్రభుత్వ బడులు, కళాశాలల్లో చదివే పేద పిల్లల పట్ల మీ శ్రద్ధ ఇదేనా జగన్ మామయ్యా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Jagananna Vidya Kanuka Kits: జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపకుండానే టెండర్లు.. భారీగా ప్రజాధనం వృథా