CM Jagan Review on Sports and Youth Services: ‘‘ఆడుదాం ఆంధ్ర’’ పేరుతో ఏటా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గ్రామం, వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై ఆయన సమీక్షించారు. సచివాలయాలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్‌లు నిర్వహించాలని.. మొత్తం 46 రోజుల పాటు ఆటలు నిర్వహించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్రతి సంవత్సరం ఈ ఆటల పోటీలు నిర్వహించాలని, క్రికెట్ లాంటి ఆటలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) మార్గదర్శకం చేస్తుందని, పోటీల నిర్వహణలో పాల్గొంటారని సీఎం తెలిపారు.
సీఎస్‌కేకు 3 స్టేడియాల్లో శిక్షణ కార్యక్రమాలు: భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాల బాధ్యతలు అప్పగిస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకు సాగాలన్నారు. దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుందని, అంబటి రాయుడు, కె. ఎస్. భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులని, వీరి సేవలను వినియోగించుకోవాలని జగన్ సూచించారు.
భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం: మొదట జిల్లా స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీల కోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో మండల స్థాయికి వచ్చే సరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామ స్థాయిలో ఆడేవారికి క్రీడా సామగ్రిని అందించాలన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలన్నారు. భవిష్యత్తులో సచివాలయానికి క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేయాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
"ఏటా ఆటల పోటీలు నిర్వహించాలి. క్రికెట్‌లో సీఎస్‌కే మార్గదర్శకం చేస్తుంది. భవిష్యత్తులో ముంబయి ఇండియన్స్ వంటి జట్టు సహాయం తీసుకుంటాం. సీఎస్‌కేకు 3 స్టేడియాల్లో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తాం. భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీమ్ రావాలి. అంబటిరాయుడు, కె.ఎస్.భరత్ యువతకు స్ఫూర్తి. రాయుడు, భరత్ సేవలను వినియోగించుకోవాలి." -వైఎస్ జగన్, ముఖ్యమంత్రి