CM Jagan On Oldage Homes In AP: 'పూర్తిగా ఎవరు లేని అవ్వలకు స్వచ్ఛందంగా ఎక్కడైనా ఉండాలనుకుంటే.. ప్రతి మండల కేంద్రంలోనూ వృద్ధాప్య ఇళ్లు కట్టిస్తానని నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలో వృద్ధాప్య ఆశ్రమం కట్టించి.. అందులో డాక్టర్లు, నర్సులను కూడా నియామిస్తానని హామీ ఇస్తున్నాను.' 2017 నవంబర్‌లో జగన్ ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజు వేంపల్లెలోని దళితవాడలో నిర్వహించిన రచ్చబండలో వృద్ధులకు ఇచ్చిన హామీ ఇది. వృద్ధుల బాధలు విని.. వారిపై ఎనలేని ప్రేమ చూపెట్టారు. మరుసటి రోజూ కమలాపురం నియోజకవర్గం నేలతిమ్మాయపల్లె దగ్గర మాట్లాడిన ఆయన మండలానికో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తాం. అధికారంలోకి రాగానే వృద్ధులను ఆదుకుంటాం’ అని చెప్పారు.
ఆ తర్వాత కూడా పాదయాత్రలో కొన్నిచోట్ల ఈ హామీ ఇచ్చారు. మాటలైతే చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక వాటిని మడతెట్టేశారు. మండలానికి ఒకటి అనే విషయాన్ని అటుంచితే.. కనీసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క వృద్ధాశ్రమాన్నీ నిర్మించలేదు. కనీసం అలాంటి ప్రతిపాదనను ఈ నాలుగేళ్లలో ఒకసారైనా పరిశీలించలేదంటనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన ప్రేమ వృద్ధులపై కాదని వారి ఓట్లపై మాత్రమేనని.
రాష్ట్రంలో 68 వృద్ధాశ్రమాలలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్నాయి. వృద్ధుల సంఖ్యకు అనుగుణంగా వీటికి కేంద్రమే గ్రాంటు విడుదల చేస్తుంది. 25 మంది ఉంటే ఏటా సుమారు 21 లక్షల రూపాయలు ఇస్తోంది. ఐదేళ్లకోసారి మౌలిక సదుపాయాలకు 4 లక్షల చొప్పున అందిస్తుంది. మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మరో రెండింటితో కలిపి 70 ఆశ్రమాలున్నాయి. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచే కొనసాగుతున్నాయి. ఇవి సరిపోవన్న ఉద్దేశంతో ప్రతిపక్షనేతగా జగన్ మండలానికి ఒకటి చొప్పున నిర్మించేస్తామని హామీ ఇచ్చేశారు. ఆ ప్రకారం రాష్ట్రంలోని 660 మండలాలకు 660 వృద్ధాశ్రమాలను నిర్మించాలి. కానీ వృద్ధాశ్రమాల హామీని సీఎం జగన్ పూర్తిగా విస్మరించారు.
"అనాథలుగ మిగిలిపోయిన వాళ్లని. ఏ ఆసరా లేని వాళ్లని. అక్కున చేర్చుకుని. వాళ్లని ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక వాగ్ధానం చేసింది. మేము అధికారం చేపట్టిన తర్వాత ప్రతి మండాలానికో వృద్ధాప్య ఆశ్రమం కడ్తానని చెప్పారు." -డి.వి రాజు, సామాజిక కార్యకర్త
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోవే కాకుండా రాష్ట్రంలో ఇతర సంస్థల నేతృత్వంలో 100కు పైనే ప్రైవేటు వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి. అత్యధికంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 18 వరకు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల్లో కొంతమంది ఉచితంగానే నడుపుతున్నారు. మరికొంతమంది డబ్బు తీసుకుంటూ కొనసాగిస్తున్నారు. తీసుకునే మొత్తం ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంది. రాష్ట్రంలో ఏ ఆదరవూ లేని వారు.. బిడ్డలు పట్టించుకోని వారు ఎంతోమంది ఉన్నారు. ఎటూ వెళ్లలేని పరిస్థితి వారిది.
ఉమ్మడి జిల్లాల చొప్పను జిల్లాకొకటి.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రమం ఉన్నా.. విభజన తర్వాత కొన్నింటిలో లేవు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృద్ధాశ్రమాల్లేవు. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 15 వరకు ప్రైవేటు ఆశ్రమాలున్నాయి. కనీసం ఇక్కడైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్యల్లేవు. ఏ దిక్కూ లేని తమనూ సీఎం జగన్ మోసం చేశారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లలో కనీసం తమ గురించి పట్టించుకున్న పాపానా పోలేదని వాపోతున్నారు..
"ప్రభుత్వం ఎలాగు వృద్ధాశ్రమలు ఏర్పాటు చేయటానికి సిద్ధంగా లేదు కనుక.. ఉన్న వృద్ధశ్రామలను గుర్తించి, రిజిస్ట్రార్ చేయించాలి. వాటికి గ్రాంట్లు ఇప్పించి ప్రోత్సహించటం చాలా అవసరమని మేము ప్రభుత్వానికి తెలుపుతున్నాము. అలాగే భవిష్యత్తులో ఎవరైనా సరే వృద్ధాశ్రమాలు పెట్టాలని ముందుకు వస్తే.. తగిన మౌలిక వసతుల ఏర్పాట్లు చేసి ప్రోత్సహించాలి." -వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్