Jagan Government Neglected Railway Projects: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను అటకెక్కించిన వైసీపీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాజెక్టులపైనా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గడచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవటంతో మొత్తం 32 రైల్వే ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వే మంత్రిత్వశాఖ ఎన్ని లేఖలు రాస్తున్నా అడపాదడపా వాటిపై మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించేసి ఊరుకోవటం మినహా నిధుల విడుదల, భూసేకరణలో రాష్ట్రప్రభుత్వం ముందడుగేయటం లేదు. రూ.29 వేల 56 కోట్లు రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తే 64 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో మళ్లీ మొదలయ్యే అవకాశముంది.
ప్ఛ్.. ఈ ఏడాది కూడా ఏపీకి రాని రైళ్లు! వీళ్లు అడగలేదు..! వాళ్లు ఇవ్వలేదు..!
రాష్ట్రంలోని ప్రాజెక్టులతో పాటు జాతీయ ప్రాజెక్టులనూ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. గత నాలుగున్నరేళ్లుగా రైల్వే ప్రాజెక్టుల్లో కనీస పురోగతి లేకపోవటంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో చేపట్టాల్సిన 16 రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ కోసం రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 16 కొత్త లైన్లు, 16 డబ్లింగ్ ప్రాజెక్టులనుకు సంబంధించి 1400 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఏపీలో 64 వేల 429 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో అన్న సందేహం వ్యక్తం అవుతోంది.
వైసీపీ హయాంలో పడకేసిన రైల్వే ప్రగతి.. ఏళ్లు గడుస్తున్నా పట్టాలెక్కని ప్రాజెక్టులు
రైల్వే ప్రాజెక్టుల విషయంలో భూ సేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2021లోనే రైల్వే మంత్రిత్వశాఖ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది. వివిధ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టులకు రాష్ట్రం వైపు నుంచి ఇవ్వాల్సిన ఆర్ధిక సహకారాన్ని ఇవ్వాల్సిందిగా సూచించింది. 5 కొత్త లైన్లు, అలాగే 2 డబ్లింగ్ లైన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా 2,956 కోట్లను ఇవ్వాలని లేఖలో కోరింది. రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవటంతో ఆ ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలాగే భద్రాచలం- కొవ్వూరు కొత్తలైను కోసం ఏపీ పరిధిలో నిర్మించాల్సిన రైల్వే లైన్ కోసం 50 శాతం నిధుల్ని ఇవ్వాల్సిందిగా రైల్వే శాఖ ప్రస్తావించింది. రాష్ట్ర వాటాగా భూమి సేకరించి ఇవ్వాల్సి ఉన్న అవేవీ పూర్తి కాకపోవటంతో ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం పడింది.
కేంద్రం మరోసారి మొండిచెయ్యి.. ఆ రైల్వే ప్రాజెక్టులకు నిధులేవి
ఏపీలో చేపట్టాల్సిన 32 రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వీటికి అయ్యే వ్యయం 64 వేల 423 కోట్లుగా ఉందని రైల్వే శాఖ స్పష్టం చేస్తోంది. 5 వేల 704 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లు ఏపీలో వచ్చే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, భూ సేకరణ చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాజీపేట కొండపల్లి మూడోలైన్‌తో పాటు ఎలక్ట్రిఫికేషన్ పనులు, త్రివేండ్రం- నగరి కొత్తలైను, కొండపల్లి-నర్సాపురం కొత్తలైన్, అలాగే విజయవాడ జంక్షన్‌పై రైలు ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేలా విజయవాడ రైల్వే బైపాస్ లైన్, కోటిపల్లి- నర్సాపురం, నడికుడి- శ్రీకాళహస్తి ఇలా వేర్వేరు ప్రాజెక్టులకు ఏపీ చెల్లించాల్సిన మొత్తం వాటా 29 వేల 56 కోట్ల రూపాయలని రైల్వే శాఖ లెక్కగట్టింది. గడచిన నాలుగున్నరేళ్లుగా ఈ నిధులు విడుదల చేయకపోటంతో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయిన పరిస్థితి.