rregularities in Jagananna Bhu Hakku- Bhu Raksha Scheme: భూ రీసర్వే అంటే కొలతల్లో చిన్నపాటి తేడాలు ఉండటం సహజం. కానీ ఐదు సెంట్లు, పది సెంట్లు కాదు ఏకంగా నాలుగు ఎకరాలు మాయం అయిందంటే అది వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం సర్వే ఫలితమే అని ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు పెదవి విరుస్తున్నారు. మేడికొండూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన మన్నవ వెంకట్రావు పేరు మీద కొర్రపాడు రెవిన్యూ పరిధిలో నాలుగు ఎకరాల 45 సెంట్ల భూమి ఉంది. జగనన్న భూ రీసర్వే తరువాత ఇచ్చిన కొత్త పాస్ పుస్తకంలో మాత్రం కేవలం 51 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్లు నమోదైంది. సర్వే సమయంలో పాత పాస్ పుస్తకాల్ని అందజేసినప్పటికీ చివరకి 51 సెంట్లు మాత్రమే ఉన్నట్లు రావడంతో వెంకట్రావు కుటుంబ సభ్యులు విస్తుపోయారు.
పాలడుగులోని అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి. తరిగొప్పుల విజయలక్ష్మికి వివాహం సందర్భంగా ఆమె తండ్రి హనుమంతరావు ఎకరా ముప్పైన్నర సెంట్లు కట్నంగా ఇచ్చారు. రీ సర్వే అనంతరం 10 సెంట్లు తేడా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను సంప్రదిస్తే సవరణకు పెట్టుకోవాలని మెుక్కుబడి సమాధానం చెబుతున్నారని వాపోయారు. శాఖమూరి కోటేశ్వరరావు అనే రైతుకు 3 ఎకరాల 80 సెంట్ల భూమి ఉంది. రీ సర్వేలో 27 సెంట్లు తక్కువగా పాస్ బుక్లో నమోదైంది. అధికారులు చుట్టూ తిరిగిన ప్రయోజనం ఉండదనే ఉద్దేశ్యంతో మళ్లీ సవరణకు పెట్టలేదన్నారు. సరైన విధానంలో సర్వే జరగకపోవడమే ఈ తప్పిదాలకు కారణమని మండిపడుతున్నారు.
పాలడుగు గ్రామంలో కొర్రపాడు రెవిన్యూ పరిధిలోని పొలాలకు మాత్రమే కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ జరిగింది. ఇందులోను సగానికి పైగా అవకతవకలు జరిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందడి మహాలక్ష్మమ్మ పేరిట 3 ఎకరాల 81 సెంట్లు ఉండగా 3 ఎకరాల 71 సెంట్లు మాత్రమే ఎక్కింది. డ్రోన్ కెమెరా సాయంతో తీసిన కొలతలకు, క్షేత్రస్థాయిలో భౌతికంగా చేసిన సర్వేకు తేడా ఉంటుందని ఆమె కుమారుడు తెలిపారు. పైగా కొత్త పాస్ పుస్తకంలో ప్రభుత్వ రాజముద్ర లేకపోవడంతో భవిష్యత్‌లో పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయో, లేదో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక గ్రామాల్లో ఇంకా భూ హక్కు పత్రాల పంపిణీ జరగలేదు. కొందరు రైతుల భూముల్లో హద్దు రాళ్లు పాతలేదు. భూ హక్కు పత్రాల్లో పురుషుడి స్థానంలో మహిళ, మహిళ స్థానంలో పురుషుడి ఫొటోలు, పేర్ల తప్పిదాలు, విస్తీర్ణంలో తేడాలు, చిరునామాలో తప్పులు, చరవాణి, ఆధార్ సంఖ్యలు తప్పుగా నమోదయ్యాయని చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకున్న నాథుడే కరవయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాగులు, చెరువులు, కుంటలు, నదులు. ఆలయ మాన్యాలు, అటవీ భూముల్లోని తేడాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సర్వేలో లోపాలకు ఇది కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు.