Warangal International Convention Center :తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) తరహాలో వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశ కేంద్రం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.175 కోట్ల తో ‘వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’ పేరిట దీనిని మడికొండ ఐటీ పార్కులో పది ఎకరాల్లో నిర్మించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీనిని చేపట్టేందుకు రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) తాజాగా టెండర్లు పిలిచింది.
International Convention Center in Warangal : తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిలో భాగంగా అక్కడ ఐటీ పార్కును ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో దేశంలో అతిపెద్దదైన కాకతీయ మెగా జౌళి పార్కును రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్ల క్రితం ప్రారంభించింది. దీనికి పలు ప్రసిద్ధ సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా సంప్రదింపుల్లో వరంగల్‌లో అంతర్జాతీయ సమావేశం మందిరం కావాలనే అంశంపై చర్చ జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ వరంగల్‌లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.వివిధ స్థలాలను పరిశీలించిన టీఎస్‌ఐఐసీ మడికొండ ఐటీ పార్కులోనే దాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. టెండర్ ఖరారయ్యాక పనులు చేపడతారు.
3 స్టార్ హోటల్ సైతం.. సమావేశ మందిరాన్ని 50వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. దానికి అనుబంధంగా మరో 30 వేల చదరపు అడుగుల్లో ప్రదర్శనశాల, సమావేశ మందిరాలు, వాణిజ్య కేంద్రాలు ఏర్పాటవుతాయి. 3 స్టార్ హోటల్, వినోద కేంద్రం, బాల్‌రూమ్, సర్వీస్ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తారు. వీటన్నింటి కోసం టీఎస్ఐఐసీ తాజాగా టెండర్లు కూడా పిలిచినట్లు సమాచారం.
ఇప్పటికే వరంగల్ నగరం.. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ద్వితీయ శ్రేణి నగరంగా పేరుపొందింది. వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించిన సర్కారు మడికొండ శివార్లలో 27 ఎకరాల్లో ఐటీ పార్క్‌ను 2016లో అభివృద్ది చేసింది. అక్కడ సైయెంట్, టెక్ మహేంద్ర సంస్ధలు కొత్త కార్యాలయాలను నెలకొల్పాయి. మరికొన్ని నూతన కార్యాలయాలు ప్రారంభించేందుకు కొన్ని సంస్థలు సన్నద్ధమయ్యాయి. మరో దిగ్గజ కంపెనీ జెన్‌పాక్ట్ వరంగల్‌లో తన సేవలు ప్రారంభించింది.
నగరంలోని సౌకర్యాల, మానవ వనరుల కారణంగా ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని... వీటన్నింటికి ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ టవర్లు ఏర్పాటుతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే మహబూబాబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఐటీ టవర్ పనులు పూర్తవుతాయన్నారు.
మరోవైపు వరంగల్‌కు ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ కేంద్రాలు రావడంపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆచరణ తోడవడంతో పెద్ద కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయని తెలిపారు. వరంగల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌తో వరంగల్ దిశ మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :