Illegal Sand Mining in Krishna River: దూరం నుంచి చూస్తే అవి కొండల్లా కనిపిస్తాయి... దగ్గరికెళ్లి చూస్తేగానీ తెలియదు అవి నదీగర్భాన్ని కొల్లగొట్టి తవ్వితీసి కుప్పలా పోసిన ఇసుక తిన్నెలని. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమార్కులు ఇసుక తవ్వకాలు జరపటంతోపాటు.. భారీగా నిల్వచేశారు. వర్షాకాలంలో ఇసుకకు వచ్చే డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతో భారీ తవ్వకాలు చేపట్టారు. భారీస్థాయిలో తవ్వితీసిన ఇసుకకు ఎవరూ లెక్కలు చెప్పలేని పరిస్థితి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణాతీరం వెంట కనిపిస్తున్న భారీ ఇసుక డంపులు... అక్రమాల లోతును తేటతెల్లం చేస్తున్నాయి.
కృష్ణాతీరం(Krishna River)లో ఇసుక తవ్వకాల్లో లోతెంత అంటే... ఇక్కడ కొండల్లా కనిపించే ఇసుక గుట్టలంత అని చెప్పొచ్చు. పల్నాడు జిల్లా పెదకూరపాడు, గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాల పరిధిలో కృష్ణాతీరం వెంట ఇసుక రీచ్ ల సమీపంలో ఇలాంటి కొండలు అన్నిచోట్లా కనిపిస్తాయి. నదీగర్భంలో అడ్డగోలుగా తవ్వకాలు చేసి ఏప్రిల్ నెల నుంచి నిల్వచేయడం ప్రారంభించారు. అప్పట్లో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేసి నదీఒడ్డున డంపింగ్ చేశారు. నదిలో ఎంత లోతు తవ్వుతున్నారు. అనుమతించిన ప్రాంతంలోనే తవ్వుతున్నారా.. జెండాలు పాతి సరిహద్దులు నిర్ణయించిన ప్రాంతంలో తవ్వారా.. వంటి విషయాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించే పరిస్థితి లేదు.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తవ్వకాలు జరిగినందున యంత్రాంగం అటువైపు వెళ్లలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కోచోట కొన్ని వేల లారీల ఇసుకను నిల్వచేశారు. ఇక్కడి నుంచి ఇసుక కావాల్సిన వాళ్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. డంపింగ్‌యార్డుల్లో ఎంత ఇసుక నిల్వచేశారన్న విషయమై స్పష్టత లేదు. ఇంత భారీస్థాయిలో ఇసుక నిల్వలు ఉన్నా పట్టించుకోని అధికారులు.. ఎవరైనా సొంత అవసరాలకు నది నుంచి ఇసుక తీసుకెళ్తే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరతో సంబంధం లేకుండా ఇక్కడ అధిక ధర వసూలు చేస్తున్నారు. గుత్తేదారులుగా ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఆధ్వర్యంలో ఇదంతా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు.
YCP Leaders Illegal Sand Mining: ఇసుకలో 'దోచుకో, పంచుకో, తినుకో'.. తవ్వకాలపై పెదవి విప్పని ప్రభుత్వం
అత్యంత లోతుకు ఇసుక తవ్వకాలు, రవాణా కారణంగా కృష్ణాతీరంలో పర్యావరణం ధ్వంసమవుతోంది. ఇసుక తవ్వకాలతో(Sand Mining) లంకల్లో ఉన్న అత్యంత సారవంతమైన భూములు కోతకు గురవుతున్నాయి. భూముల్లో వేసిన బోర్లలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. దీనివల్ల కొల్లిపర, దుగ్గిరాల, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో వేసవికాలంలో భూగర్భజలాలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుకను తరలించే క్రమంలో గ్రామీణ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. వేసవికాలంలో సముద్రం నీరు నది ద్వారా వెనక్కి వస్తే తమ పొలాలన్నీ ఉప్పమయమై పంటల సాగుకు వీల్లేకుండా పోతాయనే ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇసుక దందా సాగుతున్నందున ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.