Special Investigation Team: తెలంగాణలో పార్టీ మారడానికి తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో సోదాల పరంపర కొనసాగుతోంది. కీలక నిందితుడు రామచంద్రభారతికి సంబంధించి హరియాణ రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లోని నివాసంతో పాటు కర్నాటకలోని పుత్తూరులో పోలీసులు తనిఖీలు చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే వ్యవహారానికి సంబంధించి, కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది.
సింహయాజికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆశ్రమంలో తనిఖీలు కొనసాగాయి. గత నెల 26న మొయినాబాద్ అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో కుట్ర బయటపడిన రోజు.. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమానటికెట్‌ను బుక్ చేసింది ఓ ప్రజాప్రతినిధి బంధువుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో అందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై, సిట్ దృష్టిసారించింది.
సింహయాజిని ప్రముఖ స్వామీజీగా పేర్కొంటూ పలువురు రాజకీయ ప్రముఖులకు నందకుమార్ పరిచయంచేసినట్లు పోలీసులు గుర్తించారు. సింహయాజివద్ద ఆశీర్వాదంతీసుకుంటే మంచి జరుగుతుందని ప్రచారం చేసినట్లు భావిస్తున్న నేపథ్యంలో, రాజకీయనేతలతో సింహయాజికి ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. నందకుమార్‌కి సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.
ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినప్పుడు, కేరళకు చెందిన తుషార్‌తో రామచంద్రభారతి ఫోన్‌లో మాట్లాడించారు. తుషార్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని మాట్లాడించారు. ప్రలోభాల పర్వంలో తుషార్ పాత్ర ఏంటనే అంశంపై, పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో కొత్తగా మరో పేరు తెర మీదకు వచ్చింది. కేరళకు చెందిన ప్రముఖ వైద్యుడి ప్రమేయాన్నిపోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఆ వైద్యుడే తుషార్‌ను, రామచంద్రభారతికి పరిచయం చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని నిర్ణయించారు. తుషార్‌కు నోటీసులు ఇచ్చి విచారిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సిట్ మరిన్ని సోదాలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మరింత మందికి నోటీసులు ఇచ్చి విచారించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
కేసు ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. రోహిత్‌రెడ్డి, బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై 506 సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: