కొవిడ్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది… ఉపయోగించిన పీపీఈ కిట్లను రోడ్డు పక్కన పడేశారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలోని సామాజిక వైద్య కేంద్రంలో కరోనా బాధితులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించేలా 25 పడకల వార్డును ఇటీవల అధికారులు ఏర్పాటు చేశారు. కొవిడ్ బాధితులకు వైద్యం అందించే సమయంలో సిబ్బంది స్వీయ జాగ్రత్త కోసం మాస్కులు వినియోగిస్తారు. వాటి వినియోగం అవ్వగానే ఎంతో జాగ్రత్తగా ప్రోటోకాల్ ప్రకారం ఆసుపత్రిలోని ఎల్లో, ,రెడ్ డంపింగ్ డబ్బాలలో పడవేయాలి. తరువాత వాటి పై ఉన్న వైరస్ చనిపోయేందుకు రసాయనాలు చల్లి మూటలుగా కట్టి... వ్యర్ధాలను తీసుకువెళ్లే వాహనంలో తరలించాలి.
అయితే ఇవేమీ పట్టించుకోకుండా కొవిడ్ రోగుల వద్ద వినియోగించే పీపీఈ కిట్స్, గ్లౌస్ లను.. ఆసుపత్రి వద్ద నిరంతరం ప్రజలు తిరిగే రహదారిపై పడేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. వాటిపై ఉన్న వైరస్ ఇతరులకు అంటుకుని… కరోనా వ్యాప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ రవిచౌదరి ఆసుపత్రిలో వాడిన వ్యర్ధాలను పారవేసేలా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ సురేంద్రబాబు తన సొంత ఆసుపత్రి పై ఎక్కువ దృష్టి సారిస్తూ… ప్రభుత్వ వైద్యశాలలో పని తీరును పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి.. జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు చర్యలు: అనిల్ సింఘాల్