గుంటూరులో నిత్యం 440 టన్నుల చెత్త పోగవుతోంది. దీన్ని సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించటం ఆర్థికంగా భారమే అవుతోంది. ప్రత్యమ్నాయంగా.. తడిచెత్తను ఇళ్ల వద్దే వేరు చేసి ఎరువుగా మార్చితే భారం తగ్గుతుందనే ఉద్దేశంతో మొదట 2 వార్డుల్లో ప్రారంభించారు. తర్వాత నగరమంతా విస్తరించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించారు. హోం కంపోస్టు విధానం మొదలయ్యాక చాలామంది మహిళలు మొక్కలు పెంచటం ప్రారంభించారు. ఇంటివద్దే ఎరువును తయారుచేసి వినియోగించటంతో.. మొక్కలు బాగా పెరుగుతున్నాయని కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐటీసీ సంస్థ తోడైంది. సంస్థ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. హోం కంపోస్టు చేసుకునేందుకు వీలులేని వారి కోసం క్లస్టర్ కంపోస్ట్ విధానం మొదలుపెట్టారు. పారిశుద్ధ్య సిబ్బంది సేకరించిన చెత్తలో తడి, పొడి చెత్తను వేరుచేసి.. వాహనంలో డంపింగ్ యార్డుకు తరలిస్తారు. దీనివల్ల సగం చెత్తను రవాణా చేయాల్సిన భారం తప్పిందని అంటున్నారు.
ఇళ్లలో తయారైన ఎరువుని మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. క్లస్టర్ కంపోస్టుల్లో తయారైన ఎరువుని ప్యాక్ చేసి విక్రయించటం ద్వారా.. నగరపాలక సంస్థకు ఆదాయం సమకూరుతోంది. ఈ విధానం వల్ల.. ప్రజల్లో చెత్త నిర్వహణ పట్ల ప్రజలకు బాధ్యత వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
తడి చెత్తను డంపింగ్ యార్డులో పడేయటం వల్ల.. పొడిచెత్తతో కలసి రసాయన చర్యలు జరిగి ఆ ప్రాంతంలో వాతావరణం, భూగర్భ జలాలు కలుషితమవుతాయని నిపుణులు చెబుతున్నారు. హోం కంపోస్ట్ వల్లే.. దానికి కొంత అడ్డుకట్ట వేయొచ్చని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: 'కేబీసీ'పై వ్యతిరేకత.. అమితాబ్‌పై కేసు నమోదు