AP High Court News: హైకోర్టుకు చేరుకునే రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటులో చోటు చేసుకున్న జాప్యంపై వివరణ ఇచ్చేందుకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ హైకోర్టుకు హాజరయ్యారు. వీధి దీపాల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే 95శాతం పూర్తి అయ్యిందని సీఆర్డీఏ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నెలాఖరుకు అంతా సిద్ధమవుతుందన్నారు. కమిషనరుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆ వాదనలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ స్పందిస్తూ.. తమ ముందు హాజరుకావాలని కమిషనర్‌ను ఆదేశించాకే పనుల్లో పురోగతి కనిపించిందన్నారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. అలాగే కమిషనర్‌కు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు.
బెజవాడ నుంచి హైకోర్టుకు చేరుకునే సీడ్ యాక్సెస్ రోడ్డులో మాత్రమే వీధి లైట్లు ఏర్పాటు చేశారని కోర్టుకు వివరించారు. గుంటూరు, మంగళగిరి నుంచి హైకోర్టుకు చేరుకునే రహదారుల్లో దీపాలు ఏర్పాటు చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ నుంచి ఉన్నత న్యాయస్థానానికి చేరుకునే మార్గాల్లో విద్యుత్తు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సురక్షితమైన రోడ్ల నిర్మాణం, భద్రతా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నిర్దిష్ట గడువులోగా దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సీఆర్డీఏ కమిషనర్ అమలు చేయకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.
కొవ్వలి చెరువు ఆక్రమణ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (ప్రస్తుతం ఏలూరు జిల్లా) దెందులూరు మండలం కొవ్వలి గ్రామ పరిధిలోని 304 ఎకరాల చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ, దెందులూరు తహశీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. చెరువు స్థలాన్ని సొసైటీలకు, గ్రామ పంచాయతీకి లీజుకు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది. ఈ చర్యను ఏవిధంగా సమర్థించుకుంటారో చెప్పాలని గ్రామపంచాయతీ కార్యదర్శిని నిలదీసింది. అందుకు ఏ నిబంధనలు అనుమతిస్తున్నాయో చెప్పాలని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
కొవ్వలి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 131/4లో విస్తరించి ఉన్న 304 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ భూమి ఆక్రమణలకు గురైందని, దాని స్వభావాన్ని మార్చేసి వ్యవసాయం సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ 'గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్' మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సౌందర్య మనోహరి, మరో ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుకు చెందిన 177 ఎకరాల భూములను తహశీల్దార్ రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారన్నారు. వాటిని పలువురు వ్యవసాయ భూములుగా మార్చుకుని సాగు చేస్తున్నారన్నారు. చెరువుకు చెందిన మొత్తం 304 ఎకరాలను కాపాడి పూర్వస్థితికి తెచ్చేందుకు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. అధికారులు కోర్టుకు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. చెరువు భూమిని గ్రామ పంచాయతీ అధికారులు మత్య్సకారుల సొసైటీకి లీజుకు ఇచ్చినట్లు గమనించారు. ఆ విధంగా లీజుకిచ్చే అధికారం గ్రామ పంచాయతీకి ఎక్కడిదని ప్రశ్నించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు.