High Court on KA Paul Petition: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను ఆపేందుకు తాను దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ హైకోర్టును అభ్యర్థించారు. దీనిపై అత్యవసర విచారణకు నిరాకరించిన.. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని పేర్కొంది. మీరు అమెరికా వెళ్లినా సరే ఆన్‌లైన్ ద్వారా విచారణకు అనుమతిస్తామని తెలిపింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. విశాఖ ఉక్కు లాభ, నష్టాలను పరిశీలించేందుకు తెలుగు తెలిసిన విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా ఆదేశించాలని, స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు గ్లోబల్ పీస్ ఆర్గనైజేషన్ ద్వారా విరాళాలు సేకరించేందుకు అనుమతి ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కేఏ పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
కోర్టు ప్రారంభ సమయంలో తాను దాఖలు చేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కేఏ పాల్ అభ్యర్థించారు. స్టీల్ ప్లాంట్ కోసం రైతులు 16 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రైవేటీకరణ జరిగితే 44 వేల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయన్నారు. నామమాత్రపు ధరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. విరాళాల సేకరణ ద్వారా ప్రైవేటీకరణనను అడ్డుకుంటానన్నారు. స్టీల్ ప్లాంట్ నడిచేందుకు అవసరమైతే తనకు ఉన్న పరిచయాలతో 42 వేల కోట్ల రూపాయలను విరాళాల రూపంలో తెస్తానన్నారు. సమాజ శ్రేయస్సు కోసం బిలియన్ డాలర్లు ఇప్పటికే విరాళాలుగా ఇచ్చానన్నారు.
గ్లోబల్ పీస్ సంస్థ ద్వారా లక్షల మంది వితంతువులు, వేల కుటుంబాలను వివిధ మార్గాల్లో ఆదుకున్నానన్నారు. తాను మొదట్లో పదో తరగతి ఫెయిల్ అయ్యానని, తర్వాత అత్తెసరు మార్కులతో ఇంటర్ పాస్ అయ్యానన్నారు. డిగ్రీ పూర్తి చేయలేదన్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు దేశాలు సిఫారసు చేశాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు: స్టీల్ ప్లాంట్ కోసం విరాళాలు సేకరించేందుకు అనుమతి ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత మీడియా సమావేశంలో కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడున్నర లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్‌ను నాలుగు వేల కోట్లకు ఎలా అమ్ముతారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. చేతులెత్తి నమష్కరిస్తూ.. వ్యాజ్యాన్ని స్వీకరించాలని కోరారు. లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
ప్రస్తుతం కోర్టు అత్యవసర విచారణకు స్వీకరించకుండా.. వేసవి సెలవుల తరువాత విచారణ చేపడతామని చెప్పడంతో.. కేఏ పాల్ తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, కోర్టు నిర్ణయం పట్ల ఏ విధంగా ముందుకు వెళ్తారో అని ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: