Rain alert for AP: కోస్తాంధ్ర-ఒడిశా తీరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా ఒడిశా తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం అల్పపీడన ప్రాంతం మీదుగా రాజస్థాన్లోని జైసల్మేర్ వరకూ నైరుతి రుతుపవన ద్రోణి కూడా క్రియాశీలంకంగా ఉందని స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో ఏపీ , తెలంగాణా, ఒడిశా, మధ్యప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. రాగల 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం, తెలంగాణా రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఈ నెల 25 తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియచేసింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి సహా వేర్వేరు నదులకు వరద ప్రవాహాలు పెరిగే అవకాశముందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం సూచించింది.
హెచ్చరికలు జారీ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్నేరులో వరద ఉధృతి పెరుగుతోంది. తెలంగాణ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరుకు వరద నీరు భారీగా చేరుతుంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మున్నేరులో ఒక్కసారిగా వరద పెరిగింది. పోలంపల్లి ఆనకట్ట వద్ద పది అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. అక్కడి నుంచి దిగువకు 17వేల క్యూసెక్కుల వరద కృష్ణా నదికి చేరుతోంది. వరద ఉధృతి నేపథ్యంలో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏటిపట్టు గ్రామాల ప్రజలను మున్నేరులో దిగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
అప్రమత్తమైన కలెక్టర్ : అల్లూరి సీతారామరాజు జిల్లా శివారు మండలాలైన కోనవరం వరరామభద్రపురం ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. రహదారిపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కలెక్టర్ అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. ముందస్తుగా ముంపు ప్రాంతాల్లో ఉన్న పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
రాకపోకలకు అంతరాయం : గోదావరి వరద పెరుగుతున్న క్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలి పాలెం సమీపంలో గల పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్ వే ముంపు బారిన పడింది. ఇక్కడ వశిష్ట గోదావరి నది అనుబంధ పాయలకి వరద పోటెత్తింది. ఈ కాజ్ వే మునిగిపోయింది. ఈ కారణంగా కనకాయలంక గ్రామ ప్రజలు చాకలి పాలెం వైపు రావడానికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ముంపు నీటిలో ఉన్న కాజ్ వే పైనుంచి ప్రజలు కాలినడకన అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలు పడవలను ఆశ్రయించి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడతుందని అనుకుంటున్నారు. కోనసీమలో వివిధ నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి.