AP High Court: రైలు ప్రయాణ ఛార్జిల్లో వృద్ధులకు రాయితీని పునరుద్ధరించే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖకు హైకోర్టు స్పష్టంచేసింది. పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. కొవిడ్ వ్యాప్తి తగ్గిన విషయాన్ని గుర్తుచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. రైలు, బస్సు ఛార్జీల్లో వృద్ధులకు ఇచ్చే రాయితీని కరోనా కారణంగా రద్దు చేశారని... సాధారణ పరిస్థితులు నెలకొన్నా పునరుద్ధరించలేదని పేర్కొంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వీవీఎస్ఎస్ శ్రీకాంత్ వాదనలు వినిపించారు. గతంలో ఇచ్చిన మాదిరిగా రాయితీ కల్పించాలని కోరుతున్నామన్నారు. రాయితీతో వృద్ధులకు కొంత ఆర్థికపరమైన ఉపశమనం ఉంటుందన్నారు.
కొవిడ్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకుందన్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు రాయితీ ఇచ్చేలా రైల్వే శాఖను ఆదేశించాలని కోరారు. విద్యార్థులతో పాటు మరో 11 కేటగిరిల కిందకు వచ్చే వ్యక్తులకు రాయితీని పునరుద్ధరించామని రైల్వే శాఖ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ హరినాథ్ వాదనలు వినిపించారు. వృద్ధుల విషయంలో పునరుద్ధరణ చేయలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. కొవిడ్ పరిస్థితులు తగ్గినా ఎందుకు పునరుద్ధరించలేదని ప్రశ్నించింది. ఆర్టీసీ ఇప్పటికే వృద్ధుల ప్రయాణ ఛార్జిల్లో రాయితీని పునరుద్ధరించిందని ఏపీఎస్ఆర్టీసీ తరఫు న్యాయవాది పి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రైల్వేశాఖ ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: అమూల్ పార్లర్ల ఏర్పాటు వ్యవహారంపై హైకోర్టు ఆక్షేపణ.. సంబంధిత అధికారులకు నోటీసులు