కొవిడ్ కారణంగా పూర్తి స్థాయిలో ప్రయాణికుల రైళ్లు తిరగకపోయినప్పటికీ... సరకు రవాణా ద్వారా అధిక ఆదాయం పొందినట్లు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మోహన్ రాజా తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డివిజన్ పురగోతిపై మీడియాతో మాట్లాడిన ఆయన... గతేడాది రూ.370కోట్లు ఉన్న ఆదాయం ఈసారి రూ.473 కోట్లకు చేరిందన్నారు. సరకు రవాణా రెట్టింపు కావటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు.
గూడ్స్ ఆదాయం రూ.193కోట్లు నుంచి రూ.427కోట్లకు పెరిగినట్లు మోహన్ రాజా ప్రకటించారు. గత సంవత్సరం 1.55 మిలియన్ టన్నులు సరకు రవాణా చేయగా... ఈసారి 2.49 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసినట్లు చెప్పారు. ప్రయాణీకుల నుంచి ఆదాయం సరిగ్గా లేకపోవటంతో సరకు రవాణాపై ఎక్కువగా దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.