EO Suspend: గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వర స్వామి ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ.. దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా సింగరకొండలో విధులు నిర్వహించిన సమయంలో.. శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం ఈవో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు దేవాదాయశాఖ వెల్లడించింది.
శ్రీనివాసరెడ్డి సస్పెండ్ వెనుక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ మంత్రి వద్ద పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు.. పెదకాకాని ఆలయం ఖాతాల నుంచి జీతాలు ఇవ్వాలని కోరగా ఈవో తిరస్కరించారు. నిబంధనలు అందుకు అంగీకరించవని.. ఏదైనా సర్క్యులర్ లేదా జీవో రూపంలో ఇవ్వాలని కోరారు. దీంతో 10 రోజుల క్రితం శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయటంతో పాటు ఆయన స్థానంలో పానకాలరావు అనే అధికారిని ఈవోగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య తనకు కనీస సమాచారం లేకుండా.. ఈవోను బదిలీ చేయటాన్ని తప్పుబట్టారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఈ విషయంలో వివాదం నడిచింది. దీంతో పానకాలరావు ఇప్పటి వరకూ ఈవోగా బాధ్యతలు స్వీకరించలేదు. ఈలోగా శ్రీనివాసరెడ్డిపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపినట్లు, ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త ఈవోగా పానకాలరావును బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పానకాలరావు ప్రస్తుతం మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:
Indigo Flight Services From kadapa: కడప విమానాశ్రయం నుంచి ఇండిగో సర్వీసులు.. ఎప్పుడంటే