ప్రైవేటు ఆసుపత్రులు అనుమతులు లేకుండా కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా ఆసుపత్రిని కూడా సీజ్ చేస్తామని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని శంకరన్ హాలులో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు నిబంధనలు పాటించకుండా సరైన సదుపాయాలు, సిబ్బంది లేకుండా కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అనుమతులు తీసుకోకుండా చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఆసుపత్రుల్లో జీవో 77 ప్రకారమే ఫీజులను వసూలు చేయాలన్నారు. అధికంగా ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా కొవిడ్ 19 చికిత్స కోసం 30 ఆసుపత్రులను గుర్తించామని, ఇందులో ఆక్సిజన్ బెడ్లు 2 వేలు, ఐసీయూ బెడ్లు 400 ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 34277 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, జూన్, జులై మాసంతో పోలిస్తే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. గతంలో పాజిటివ్ శాతం 14.5 శాతంగా ఉంటే ప్రస్తుతం 10.3 శాతానికి తగ్గిందన్నారు. మాచర్ల, సత్తెనపల్లి ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, వీటి సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. మాస్కులను ధరించకపోవటం వల్లనే వైరస్ వ్యాప్తి చెందుతోందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థ పరిశోధనలో తెలిసిందన్నారు.
ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులను ధరించకుండా తిరుగుతున్నారని, ఇటీవల తన పర్యటనలో గమనించినట్లు పేర్కొన్నారు. దుకాణాలు, బ్యాంకులకు మాస్కులు లేకుండా వచ్చే వారిని అనుమతించరాదని సూచించారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, యాంటిజెన్ కిట్ల ద్వారా మాత్రమే కొవిడ్ 19 నిర్ధారణ అవుతుందని, సిటీస్కాన్ ఆధారంగా పాజిటివ్ నిర్ధారించి చికిత్స అందించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక