Face Recognition System Special Drives: ఏపీ ఫేస్ రికగ్నిషన్ సిస్టం యాప్ ద్వారా హాజరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ యాప్ ద్వారా 100 శాతం హజరు నమోదుకు అన్ని విభాగాల కార్యదర్శులు, విభాగాధిపతులు , జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సాధారణ పరిపాలన శాఖ సూచనలు జారీ చేసింది. ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా 100 శాతం హాజరు నమోదు కాకపోతే సంబంధిత శాఖలు, విభాగాల పాలనా అధికారులు, నోడల్ అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆదేశాలు ఇచ్చింది.
ముఖ ఆధారిత యాప్ను తప్పనిసరి చేసినా చాలా మంది ఉద్యోగులు ఇంకా యాప్ డౌన్ లోడ్ చేసుకోలేదని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. ముఖ ఆధారిత హాజరు యాప్ను ప్రవేశపెట్టి నెలరోజులు గడుస్తున్నా వందశాతం ఫలితాలు రావటం లేదని స్పష్టం చేసింది. ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా మాత్రమే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలియచేసింది. 2023 జనవరి 1 తేదీ నుంచి రాష్ట్ర సచివాలయం, 2023 జనవరి 16 నుంచి ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో యాప్ ద్వారా ముఖ ఆధారిత హాజరు నమోదు చేపట్టినట్టు తెలిపింది. ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదైన హాజరు పర్యవేక్షణకు డీడీఓలు, నోడల్ అధికారులకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఉల్లంఘనలూ లేకుండా ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు నమోదు కావాల్సిందేనని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: