గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘం పరిధిలోని టిడ్కో ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇళ్ల విషయంలో పలువురు కౌన్సిలర్లు అక్రమాలకు పాల్పడ్డారని.. విజిలెన్స్ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. 30 మంది లబ్ధిదారులు, 8 మంది కౌన్సిలర్లు, కొందరు మున్సిపల్ సిబ్బందిని నిందితులుగా తేల్చారు. సాక్ష్యాధారాలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చిరంజీవితో సహా అప్పటి మున్సిపల్ కమిషనర్లు రంగారావు, నాగేశ్వరరావు, శివారెడ్డి, వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలంటూ సర్కారు జీవో విడుదల చేసింది. కౌన్సిలర్లు రంగిశెట్టి నరేంద్ర, శ్రీనివాసరావు, నాగలక్ష్మి, రమాదేవి, మల్లీశ్వరి, రమణ, బసవమ్మలూ ఈ జాబితాలో ఉన్నారు.
మంగళగిరి పరిధిలో 1,728 టిడ్కో ఇళ్లు ఉండగా.. 2,600 మంది నుంచి డీడీలు సేకరించారని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ డబ్బు ఎక్కడున్నా వాటిని తిరిగి ప్రజలకు అందజేస్తామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమాలకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని.. మంగళగిరి పురపాలక సంఘం కమిషనర్ హేమామాలిని రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసిన నేతలపై.. కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: