No Development in IT Sector: కాన్సెప్ట్ నగరాల ద్వారా ఐటీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులను రాబట్టాలన్నది ప్రభుత్వం ఆలోచన. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో ఉన్న ఐటీ పరిశ్రమల విస్తరణ ప్రాజెక్టులను ఆకట్టుకునేందుకు వీలుగా అనంతపురం జిల్లాలోని బెంగళూరుకు సరిహద్దు ప్రాంతం.. అదే విధంగా చెన్నైకి సరిహద్దులోని తిరుపతిని కాన్సెప్ట్ నగరాల కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఐటీ కేంద్రంగా ఉన్న విశాఖపట్నంలో మరో కాన్సెప్ట్ నగరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ నగరాలను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు.
ఒక్కొక్క సిటీ 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని.. అమెరికాలోని కొలంబియా తరహాలో ఐటీ, హైఎండ్ టెక్నాలజీకి కేరాఫ్‌గా కాన్సెప్ట్ సిటీలు ఉండాలని స్పష్టంచేశారు. ఈ మేరకు ఐటీ శాఖపై 2019 నవంబరు 21న నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మూడు కాన్సెప్ట్ నగరాల ఏర్పాటు ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని గత ఫిబ్రవరిలో సెలవిచ్చారు మన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.
సీఎం జగన్ చెప్పిన కాన్సెప్ట్ నగరాల ప్రతిపాదనను సైతం ప్రభుత్వం అటకెక్కించేసినట్టే కనిపిస్తోంది. వాటి ఏర్పాటుకు సంబంధించి ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు. ప్రాథమిక కసరత్తు చేయలేదు. కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలూ కొలిక్కి రాలేదని ఐటీ శాఖ చెబుతోంది. సీఎం జగన్ చెప్పిన ప్రకారం ఒక్కొక్క కాన్సెప్ట్ సిటీ ఏర్పాటుకు కనీసం 2 వేల 500 ఎకరాల భూమి అవసరం. సీఎం ప్రకటించి నాలుగేళ్లు పూర్తి కొవొస్తున్నా భూములు ఏ ప్రాంతంలో ఉన్నాయనేది ఇప్పటికీ గుర్తించలేదు.
రాష్ట్రం నుంచి లక్షలాదిమంది ఐటీ నిపుణులు బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్ నగరాల్లోని ఐటీ కంపెనీలకు వెళ్లిపోయారు. ప్రతి సంవత్సరం కనీసం లక్ష మంది ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నా.. వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటైతే.. వారంతా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంకుర సంస్థలు భారీగా రావొచ్చు. కానీ ఐటీ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.
Vizag Metro: విశాఖ మెట్రోకు మంగళం పాడిన జగన్.. నాలుగేళ్లుగా మాటలకే పరిమితం
కొవిడ్ తర్వాత సొంత ప్రాంతాలకు చేరాలనుకునే వారి సంఖ్య కూడా పెరిగిందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఐనా కాన్సెప్ట్ నగరాలు కేవలం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి తప్పించి.. కార్యరూపంలోకి రాలేదు. దీంతో కాన్సెప్ట్ నగరాల అని చెప్తూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడమే తప్ప.. ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులు మాత్రం రావడం లేదు.