తల్లుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా చేసే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు... గుంటూరు జిల్లా చుండూరు మండలం వలివేరులోని రెండో అంగన్‌వాడీ కేంద్రం కృషి చేసింది. ఆ గ్రామంలో 335 గృహాలున్నాయి. ఇక్కడి సేవలు పొందే... చిన్నారులు, గర్భిణీలు, బాలింతల సంఖ్య సగటును 100 లోపు ఉంటుంది. వీరందిరికీ.... అంగన్‌వాడీ కార్యకర్త సుజాత రాజేశ్వరి, ఆశ కార్యకర్త శాంతకుమారి, ఏఎన్ఎమ్ వెంకటేశ్వరమ్మ.. వైద్య సేవలు, పోషకాహారం క్రమంతప్పకుండా అందేలా చూశారు.
సమష్టిగా వారు చేసిన కృషికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారానికి ఆ కేంద్రం ఎంపికైంది. ఇటీవల కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతులమీదుగా దిల్లీలో పురస్కారం అందుకున్నారు. ప్రశంసా పత్రాలతోపాటు ఒక్కొక్కరికి 50 వేల నగదు ప్రోత్సాహం లభించింది. కలసికట్టుగా పనిచేయడం వల్లనే అవార్డు వచ్చిందని, మరింత ఉత్సాహంతో ఇకపై పనిచేస్తామని ఆ బృందం తెలిపింది.