గుంటూరు జిల్లాలో నాలుగో విడత ఎన్నికలు 6 నియోజకవర్గాలు... 19 మండలాల పరిధిలో జరగునున్నాయి. ఈ కారణంగా.. అందరి దృష్టి చివరి విడత పంచాయతీ ఎన్నికలపైనే కేంద్రీకృతం అయ్యింది. గుంటూరు జిల్లాలో తొలి మూడు విడత ఎన్నికలు సాపీగా నిర్వహించడంలో విజయవంతమైన జిల్లా అధికారులు... నాలుగో విడత ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న ఎన్నికల్లో... పెద్దసంఖ్యలో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.
నాలుగో విడత పంచాయతీ ఎన్నికలను... 266 గ్రామపంచాయతీల్లో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇందులో 27 పంచాయతీలు, 2,810 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 239 పంచాయతీ సర్పంచి పదవులకు 724 మంది, 2085 వార్డులకు 4 వేల 423 మంది పోటీపడుతున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలతోపాటు గుంటూరు గ్రామీణ మండలంలోని 9 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
19 మండలాల్లో చివరి విడత ఎన్నికల ప్రక్రియకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తుండగా...మరోవైపు అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. చివరి విడతలో అమరావతి, పెదకూరపాడు, పెదకాకాని, ప్రత్తిపాడు, పెదనందిపాడు, తాడికొండ, పొన్నెకల్లు, ఫిరంగిపురం, నంబూరు, వట్టిచెరకూరు, ముట్లూరు, వరగాని, జొన్నలగడ్డ, కంతేరు, నిడుముక్కల వంటి జనాభాపరంగా పెద్ద గ్రామాలున్నాయి. వీటి ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేటి సాయంత్రం (శుక్రవారం) తో ప్రచారం గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు.
భద్రత కట్టుదిట్టం
ఎక్కువసంఖ్యలో పంచాయతీలకు నాలుగో విడత పోలింగ్ ఉండటంతో.. శాంతిభద్రతల పరిరరక్షణపై పోలీసులు పక్కాగా దృష్టిపెట్టారు. ఎక్కడెక్కడ వివాదాలకు ఆస్కారముందో.. ఆయా గ్రామాల్లోని వివాదాస్పద నేరచరిత్ర గలిగిన వ్యక్తులను బైండోవర్ చేశారు. గుంటూరు అర్బన్ పోలీసులు ముందుగానే గ్రామాలకు వెళ్లి పల్లెనిద్ర చేపడుతున్నారు. దీనివల్ల గ్రామంపై స్పష్టమైన అవగాహన ఏర్పడి.... అనుమానితుల కదలికలను నియంత్రించే అవకాశముంది. నాలుగో విడత ఎన్నికలకు సంబంధించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. ఎన్నికలు దగ్గరపడుతుండంతో ప్రలోభాలకు తావులేకుండా.. నగదు, మద్యం సరఫరాను నియంత్రించేందుకు.. పోలీసులు మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: