గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 287కు చేరుకుంది. కొత్తగా వచ్చిన కేసుల్లో 2 గుంటూరు నగరంలో, మరో 2 నర్సరావుపేట పట్టణంలో వచ్చాయి. ఈ 2 ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరుణంలో అధికారులు హాట్ స్పాట్లుగా ప్రకటించారు. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
గుంటూరు నగరంలో రెడ్ జోన్లలో కాకుండా కొత్త ప్రాంతంలో ఓ కేసు నమోదైంది. అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలను అధికారులు తీవ్రం చేశారు. పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అక్కడకు చేరుకుని పాజిటివ్ కేసులు వచ్చిన వారి కుటుంబసభ్యులను ఆసుపత్రికి పంపించారు. అలాగే ఇరుగు, పొరుగు వారిని క్వారంటైన్ కు తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరికైనా అనారోగ్యంగా ఉందా అనే విషయంపై ఆరా తీశారు. ఆరోగ్యం బాగాలేని వారికి వైద్యులతో పరీక్షలు చేయించేలా చర్యలు చేపట్టారు.
ప్రతి అర కిలోమీటర్‌కు చెక్‌పోస్టు...
జిల్లాలోని రెడ్ జోన్లలో ర్యాపిడ్ విధానంలో కరోనా నిర్ధారణ పరీక్షలు తీవ్రం చేశారు. తద్వారా పాజిటివ్ రోగులను త్వరగా గుర్తించే వీలుందని అధికారులు చెబుతున్నారు. అలాగే లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. నర్సరావుపేటలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. గుంటూరు నగరంలో ప్రతి అర కిలోమీటర్‌కు ఓ చెక్ పోస్టు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను కట్టడి చేశారు. అలాగే అత్యవసర సర్వీసులు, పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు.
ఇవీ చదవండి: