ganja smuggling: గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను గుంటూరు జిల్లా దుగ్గిరాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరకు నుంచి తెనాలికి గంజాయి తరలిస్తుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు.
ఆపకుండా వెళ్లారు.. వెంబడించి పట్టారు..
తెనాలి పట్టణంలోని ఐతానగరుకు చెందిన అఖిల్, నందులపేటకు చెందిన భాషా అలియాస్ తలైవా, బాలాజీరావుపేటకు చెందిన అబ్దుల్ హమాన్, సాయికృష్ణ గంజాయి తెస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దుగ్గిరాల బల్లకట్టు వంతెన వద్ద వీరి కారును ఆపేందుకు ప్రయత్నించారు. అపకుండా వేగంగా ముందుకు దూసుకెళ్లిన వీరు పాతలాకు వద్దకు చేరుకున్నారు. ఎదురుగా తెనాలి గ్రామీణ సీఐ వాహనం రావడం గమనించారు. దీంతో లాకుల వద్ద నుంచి కాల్వ అవతల ఉన్న మోరంపూడి రోడ్డులోకి వైపునకు మళ్లారు. మోరంపూడి దాకా వెళ్లగానే ఎదురుగా ధాన్యం బస్తాలతో వస్తున్న ట్రాక్టర్, లాడి వీరికి అడ్డువచ్చాయి. తక్కువ వెడల్పు రోడ్డు కావడంతో ముందుకు వెళ్లలేక ఒక్కసారిగా బ్రేకులు వేయగా.. కారు ముందు టైరు పగలింది. అక్కడ రేవులో బట్టలు ఉతుకుతున్న మహిళలు సైతం భయపడ్డారు. వెనుక నుంచి పోలీసు వాహనం వస్తుండడంతో కారు దిగేసి మోరంపూడి వంతెన మీదుగా తెనాలి-విజయవాడ రోడ్డు మీదకు వచ్చి పొలాల్లోకి పరుగులు తీశారు. పోలీసులు వారిని పట్టుకున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: Crime news: పోలీసుల అదుపులో.. చోరీ నిందితులు