గుంటూరు జిల్లాలో భూముల విలువ అధికంగా ఉండటం... అడవులను పరిరక్షించే సిబ్బంది తక్కువ కావటంతో రాత్రికి రాత్రే అటవీభూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రిజర్వు అటవీ ప్రాంతంలోనూ దట్టమైన చెట్లు లేకపోవడం, భూగర్భజలాలు, సాగు నీటి లభ్యత ఉండటంతో అటవీ భూములు ఆక్రమిస్తున్నారు. ఆక్రమిత భూముల్లో యథేచ్ఛగా పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో 1.61 లక్షల హెక్టార్లలో అటవీ విస్తీర్ణం ఉండగా సుమారు 5 వేల హెక్టార్లు అక్రమణలకు గురైంది. చట్టంలో ఉన్న లొసుగులను అవకాశంగా మార్చుకుని ఏటికేడు ఆక్రమణలు విస్తరిస్తున్నారు. అటవీ భూములు కాపాడటానికి జిల్లా మొత్తానికి కలిపి 75 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఒక్కో బీట్ అధికారి పరిధిలో వేల హెక్టార్లు విస్తరించి ఉండటం, దట్టమైన అడవులు కాకపోవడంతో సులభంగా అటవీ ప్రాంతంలోకి చొచ్చుకువస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలు అండగా ఉండటంతో యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా బెల్లంకొండ, రాజుపాలెం, క్రోసూరు, అచ్చంపేట, మాచర్ల, బొల్లాపల్లి, వినుకొండ, కారంపూడి, నకరికల్లు, దాచేపల్లి మండలాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాగర్ కాలువల ద్వారా నీటి లభ్యత ఉండటంతో అటవీ భూముల్లో పంటలు సాగుచేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా బోర్లు వేసి విద్యుత్తు కనెక్షన్ తీసుకుని పంటలు వేస్తున్నారు. సాగర్ కాలువల నుంచి అక్రమంగా నీటిని తోడి పంటలు పండిస్తున్నారు. కొందరైతే అభివృద్ధి చేసిన భూములను వేరే వాళ్లకు విక్రయిస్తున్నారు. కళ్లెదుటే ఆక్రమణలు జరుగుతున్నా సిబ్బంది కొరత, రాజకీయజోక్యం వంటి కారణాలతో అటవీ శాఖ సిబ్బంది నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు.
జిల్లాలో ఆక్రమణలకు గురైన అటవీ భూముల లెక్కలు తేల్చిన అధికారులు... ఇప్పుడు వాటి స్వాధీనానికి నడుం కట్టారు. ఇటీవల మాచర్ల మండలంలో 15 ఎకరాలు స్వాధీనం చేసుకుని అక్కడ మొక్కలు నాటారు. ఆక్రమణల తొలగింపులో కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని... రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని వాటిని అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 14.5 శాతం విస్తీర్ణంలో రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. రోడ్లు, పొలంగట్లు, సామాజిక స్థలాల్లో కలిపి మరో 2.5 శాతం, పండ్ల తోటల వల్ల మరో 2 శాతం కలిపి మొత్తం 19 శాతం విస్తీర్ణంలో పచ్చదనం కింద లెక్కిస్తున్నారు. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం విస్తీర్ణంలో మూడో వంతు అడవులు ఉండాలి. అది నెరవేరాలంటే అటవీ భూముల ఆక్రమణలు ఆపడంతో పాటు సామాజిక వనాలు పెంచాలి. అలాగే కాలువలు, చెరువుల గట్ల మీద మొక్కలు నాటాలి. పండ్ల తోటల విస్తీర్ణం క్రమంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేయాలి. రిజర్వు అంటవీ ప్రాంతం విస్తీర్ణం పెరిగే అవకాశం లేనందున ప్రత్యామ్నాయ మార్గాల్లో పచ్చదనం పెంచే దిశగా చర్యలు చేపట్టాలి.
ఇదీ చదవండి:
చీరాలలో ఏదో చేద్దామని అనుకుంటే పొరపాటే... పోలీసులకు వైకాపా నేత హెచ్చరిక