ఎగువన కురిసిన భారీ వర్షాలకు పులిచింతల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల ... గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని పలు గ్రామాల్లోకి వరద చేరింది. కృష్ణా వరద ప్రవాహం వెనుకకు మళ్లడం వల్ల పెదమద్దూరు వద్ద...విజయవాడ - అమరావతి ప్రధాన రహదారిపై నీరు నిలిచింది. రాకపోకలు నిలిచిపోయాయి. అమరేశ్వర ఆలయం, ధ్యాన బుద్ధ వద్ద ఉన్న పుష్కర ఘాట్లు నీట మునిగాయి. మునగోడు శివారు కాలనీలు జలమయమయ్యాయి. అచ్చంపేట మండలం తాడువాయి ప్రధాన రహదారిలో వంతెన మీదుగా వరద ప్రవహిస్తోంది. చల్లగరిగ, తాడువాయి, చామర్రు, కోనూరు, కస్తల గ్రామాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పొంచి ఉన్న వరద ముప్పు
ప్రకాశం బ్యారేజీ నుంచి వరదల కారణంగా దిగువ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. తెనాలి డివిజన్ పరిధిలో లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే గుటూరు జిల్లాలోని లంక గ్రామాల్లోకి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కొల్లిపర బొమ్మవానిపాలెం ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే శివకుమార్ పర్యచించారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరదల కారణంగా... కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి, మినుము పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వందల ఎకరాల్లో పంట నష్టం
తుళ్లూరు మండలంలో కృష్ణా నది ఉద్ధృతికి వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, వెంకటపాలెంలోని మత్స్యకార కాలనీలు నీట మునిగాయి. వరద ప్రవాహం వస్తుందని అధికారులు చెప్పడంతో... మత్స్యకారులు కరకట్టపైకి చేరుకున్నారు. కొంతమంది ఇళ్లలోనూ బిక్కుబిక్కుమంటూ రాత్రంతా విష పురుగుల మధ్య గడిపారు. తుళ్లూరు మండలంలో 117 ఎకరాలలో అరటి, 150 ఎకరాలలో పసుపు, 120 ఎకరాలలో కూరగాయలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గత ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్లను వైకాపా సర్కార్ పంపిణీ చేసి ఉంటే ఈ కష్టాలు తప్పి ఉండేవని మత్స్యకారులు వాపోయారు.
నిండు కుండలా పులిచింతల
ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయానికి 5.77 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో పులిచింతలకు సంబంధించి 17 గేట్లు ఎత్తి 5.58 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల వదులుతున్నారు. ఇన్ ఫ్లో నిన్నటితో పోలిస్తే తగ్గటంతో సాయంత్రానికి వరద కొంతమేర అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదనీటి ప్రవాహం తగ్గితే కొన్ని గేట్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 44.79 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది.
ఇదీ చదవండి:
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద... లోతట్టు ప్రాంతాలు జలమయం