Floating Musical Fountain At Tank Bund: హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం ఆవిష్కృతమైందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ‘ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నిర్ణయించారన్నారు.
దుబాయిలోని బుర్జ్ ఖలీఫా వద్ద ఉన్నట్లుగా.. సచివాలయం, మరోవైపు అంబేడ్కర్, ఎదురుగా బుద్ధుడి విగ్రహం వీటన్నింటికీ శోభ చేకూర్చేలాగా రూ.17.02 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఫౌంటెయిన్, లేజర్‌షో ఏర్పాటు చేశామన్నారు. నిత్యం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఫౌంటెయిన్ విన్యాసాలు వీక్షించవచ్చన్నారు.
Minister Talasani Inaugurated Floating Musical Fountain: హోంశాఖ మంత్రి ముహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.
నగర పర్యాటకంలో మరో అదనపు ఆకర్షణగా మ్యూజికల్ ఫౌంటెయిన్ నిలువనుంది. ఫార్ములా ఈ-రేస్‌కు నగరం ముస్తాబు అవుతున్న తరుణంలో అంతకుముందే దీనిని ప్రారంభించారు. నగర సందర్శనకు వచ్చే పర్యాటకులు చాలామంది ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డును చూడకుండా తిరిగి వెళ్లరు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డును సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్‌తోపాటు లేజర్‌షోకు శ్రీకారం చుట్టారు.
లుంబినీపార్కు, ఎన్టీఆర్‌మార్గ్‌లో నిలబడి ఈ షోను ఎవరైనా చూడవచ్చు. ఫౌంటెయిన్, లేజర్‌షో పొడవు 180 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు, 90 మీటర్ల ఎత్తు. ఇందులో 3 జతల లేజర్లు ఉంటాయి. ఒక్కో లేజర్‌ను ఒక్కో థీమ్‌తో రూపొందించారు. దేశభక్తి గేయాలు.. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు ప్రస్ఫుటమయ్యే మ్యూజికల్ థీమ్స్ ఇందులో ఉన్నాయి. నిత్యం మూడు షోలు, వారాంతంలో నాలుగు షోలు ఉంటాయి.
ఇవీ చదవండి: