కొడుకు ప్రవర్తనతో విసిగివేసారిన ఓ తండ్రి రోకలిబండతో అతనిని కొట్టి హతమార్చిన సంఘటన చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామంలో జరిగింది. గొట్టిపాడు గ్రామానికి చెందిన తుమ్మలగుంట ఏసోబు, రత్నమ్మకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు నరేష్ ఇంటి వద్ద ఉంటూ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడికి 10 సంవత్సరాల క్రితం బొప్పూడి గ్రామానికి చెందిన అలేఖ్యతో వివాహం జరిగింది. మొదటి నుంచి మద్యం అలవాటు ఉన్న నరేష్ తరచూ ఇబ్బంది పెట్టడంతో విసిగిపోయిన భార్య 5 సంవత్సరాల క్రితం పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. అతనిపై కేసు కూడా పెట్టింది. నరేష్ తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. మూడు నెలల క్రితం మద్యం తాగి వచ్చి తల్లితో గొడవ పడి చెయ్యి విరగ్గొట్టాడు. దీంతో ఆమె అదే గ్రామంలో ఉన్న తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో కుమారుడికి ఎంత నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. బుధవారం రాత్రి మద్యం సేవించి నరేష్ ఇంటికి వచ్చాడు. అన్నం పెట్టలేదని తండ్రితో గొడవపడి దాడి చేయబోయాడు. అప్పటికి తండ్రి కొడుకుకి సర్ది చెప్పి అన్నం వండుకుని... ఇద్దరూ తిని పడుకున్నారు. అప్పటికే విసిగిపోయిన తండ్రి ఏసోబు కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అని భావించి ఉదయాన్నే లేచి నిద్రపోతున్న కొడుకు తలపై రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఏసోబుని అరెస్ట్ చేసినట్లు చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు తెలిపారు.
ఇదీ చదవండి :