Farmers Hunger Strike Against R-5 Zone In Krishnayapalem : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల దాదాపు 60 లక్షల కోట్ల సంపదను రాష్ట్రం కోల్పోయిందని ప్రొఫెషనల్ ఫోరం ప్రతినిధులు ఆరోపించారు. రాజధానిలో ఆర్-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో రైతుల చేస్తున్న నిరాహార దీక్షలకు ప్రొఫెషనల్ ఫోరం ప్రతినిధులు, జనసేన పార్టీ నేతలు మద్దతు పలికారు. రైతులకు సంఘీభావంగా దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అమరావతి ఆర్థిక వనరు : బుద్ధుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉన్న అడ్డంకి ఏంటని ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేటి ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. బుద్ధ పూర్ణిమ వేడుకను కూడా నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందని ఆయన అన్నారు. బహుజనులు, పేదలకు మధ్య చిచ్చు పెట్టేందుకే ఆర్-5 జోన్ తెరపైకి తీసుకువచ్చారని, అమరావతి ఆర్థిక వనరులను సృష్టిస్తుందని నేటి ఉమామహేశ్వరరావు అన్నారు.
తక్షణమే ఆర్-5 రద్దు చేయాలి : ఆర్-5ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని, వెంటనే ఆర్-5ని రద్దు చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చెప్పారు. ఒక రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయినప్పుడు, ప్రభుత్వానికి కావలసినటువంటి భవంతులు, ప్రభుత్వ పరిపాలనకు కావలసిన బిల్డింగ్లు కట్టుకోవడానికి అవరావతి రైతులు ముందుకు వచ్చి పొలాలను త్యాగం చేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవరావతి రాజధానికి మద్ధతు తెలిపిన జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే మాట తప్పాడని, మడమ తిప్పాడని అన్నారు. అమరావతి మహిళా రైతులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో ప్రభుత్వం అఫిడవిట్ వేసిన ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయకపోతే రాష్ట్రంలోని పేదలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కూర్చోబెడతామని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.
"రైతులు, ఇతర వర్గాల వారిని విడదీసి.. ఇద్దరి మధ్య విభజించు - పాలించు అనే కొత్త తరహా రాజకీయం చేస్తున్నావు. కొత్తగా జోన్ ఏర్పాటు చేసి, దళితులకు భూములు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? అమరావతి అనేది ఆర్థిక వనరు సృష్టంచే భూమి."- నేతి ఉమామేశ్వరరావు, ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు
"మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకైతే సిగ్గుగా ఉంది. ఆర్-5ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది.. పేదలను వ్యతిరేకించండం లేదు. నీ చర్యను వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే దానిని రద్దు చేయాలి. న్యాయస్థానంలో ప్రభుత్వం అఫిడవిట్ ప్రకారం అమరావతి నిర్మించాలని జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ నుంచిహెచ్చరిస్తున్నాము."- గాదె వెంకటేశ్వరరావు, జనసేన నేత
ఇవీ చదవండి