గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లి గ్రామాల పరిధిలోని కొందరి రైతుల భూములు రిజర్వ్ జోన్ చేర్చటం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి..178 ఎకరాల భూమిని 2015 ఏడాదిలో అప్పటి ప్రభుత్వం U1 రిజర్వ్ జోన్‌గా ప్రకటించింది. దీంతో ఆ భూములను వ్యవసాయానికి తప్ప వేరే ఏ కార్యకలాపాలకు ఉపయోగించకూడదు. ఈ నిబంధన తెచ్చినప్పుడు రైతుల నుంచి అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రైతులంతా వెళ్లి సీఆర్డీఏ అధికారులనూ కలిశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలసి సమస్యను వివరించగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాదయాత్ర సమయంలో తాడేపల్లి వచ్చిన జగన్‌ని కూడా రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. తాను అధికారంలోకి వస్తే రిజర్వ్‌జోన్‌ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
U1 రిజర్వ్‌జోన్‌గా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే.. తాడేపల్లి మున్సిపాలిటీలో అందుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అనంతరం తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపారు. అయితే ఇప్పటికీ ఆ రైతుల సమస్యకు పరిష్కారం లభించలేదు. స్థానిక ఎమ్మెల్యే, సీఆర్డీఏ అధికారులు కలిసినా ప్రయోజనం కనిపించలేదు.
పిల్లల చదువులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. తమ భూముల్ని విక్రయించుకునేందుకు వీలు కల్పించాలని.. రిజర్వ్‌జోన్ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాదయాత్ర చేసినప్పుడు జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: పురపాలికల్లో ముగ్గురు కోఆప్షన్ సభ్యులు.. మార్గదర్శకాలు విడుదల