Jagan assurances on Guntur Vahini: 2022 జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన బహిరంగసభలో గుంటూరు వాహిని పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ ఘనంగా ప్రకటన చేశారు. 8 దశాబ్దాలుగా ఉన్న సమస్య తీరుతుందని సభకు హాజరైన ప్రజలు, రైతులు భావించారు. ఆ మాటిచ్చి ఏడాదిన్నర దాటినా నెరవేరకపోవటంతో రైతులు రోడ్డెక్కారు. నల్లమడ రైతుసంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ముందు జూన్ 28 నుంచి నిరసన దీక్షలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట ఇంకా ఆచరణలోకి రాకపోవడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
బ్రిటిష్ కాలం నుంచి నిరసన.. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1936లో పెదనందిపాడు ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. 1954 నుంచి ఈ ప్రాంత ప్రజలు తాగు, సాగునీటి కోసం ఆందోళనలు చేస్తున్నారు. 1962లో ప్రాజెక్టుని గుంటూరు వాహినిగా పేరు మార్చి ప్రకాశం బ్యారేజీ నుంచి వట్టిచెరుకూరు మండలం గారపాడు వరకు 47 కిలోమీటర్ల కాలువ నిర్మాణం చేపట్టారు. అక్కడ పనులు ఆగిపోయాయి. అప్పట్లో ఈ ప్రాంతంలో పొగాకు సాగు ఎక్కువగా ఉండేది. నీటికాలువ వస్తే నాణ్యమైన పొగాకు పండదని.. విదేశాలకు ఎగుమతి చేయలేమని కొందరు వ్యాపారులు సాగునీటి కాలువలు రాకుండా అడ్డుకున్నారు. జీవో నెంబరు-8 రావడానికి కారణమయ్యారు. కాలక్రమంలో పొగాకు స్థానంలో పత్తి, మిర్చి, శనగ పంటలు వేయడంతో సాగునీటి అవసరాలు పెరిగాయి. దీంతో గుంటూరు వాహిని పొడిగించాలని రైతులు ఆందోళనలు ప్రారంభించారు.
ఇప్పటికీ విస్తరణ ప్రశ్నార్థకంగానే.. కాలువను ప్రస్తుతమున్న 47వ కిలోమీటరు నుంచి 74.06 కిలోమీటర్ల వరకు పొడిగించాలని.. కొన్నిచోట్ల ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, బాపట్ల జిల్లా పర్చూరు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో 38 వేల 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సాగర్ కాలువల కింద ఉన్న కాకుమాను, మల్లాయపాలెం మేజర్ల కింద 9వేల 600 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. మొత్తంగా 48వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. గుంటూరు వాహిని విస్తరణకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలోనే 2019 జనవరి 10న 274.53 కోట్లు విడుదల చేస్తూ జలవనరులశాఖ జీవో జారీ చేసింది. టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేశారు. అప్పట్లో ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో పనులు చేపట్టలేదు.
కాలువ నీటిప్రవాహ సామర్థ్యం 600 క్యూసెక్కుల నుంచి 750 క్యూసెక్కులకు పెంచడానికి గత ప్రభుత్వం 378.25కోట్లతో 2019లో టెండర్లు పిలిచింది. సాంకేతిక కారణాల వల్ల గుత్తేదారులతో ఒప్పందాలు జరగలేదు. వైసీపీ గెలిచిన తర్వాత అదే గుత్తేదారు సంస్థను కొనసాగించి పనులు పూర్తిచేస్తామని ప్రకటించినా.. అడుగు ముందుకు పడలేదు. రెండేళ్లలో పూర్తిచేస్తామన్న సీఎం వాగ్దానం మరో ఆరు నెలల్లో పూర్తికానుంది. ఇప్పటికీ విస్తరణ ప్రశ్నార్థకంగానే మారింది.
అమీతుమీకి రైతులు సిద్దం.. వాహిని పొడిగింపునకు గుంటూరు జిల్లాలో 389.78ఎకరాలు, బాపట్ల జిల్లాలో 51.38ఎకరాలు భూమి సేకరించాల్సి ఉంది. దీనికి 113.39కోట్లు అవసరమని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రస్తుతం రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చాలన్న పెదనందిపాడు మండలం అన్నపర్రు, రాజుపాలెం, పాలపర్రు గ్రామాల విజ్ఞప్తితో.. అదనంగా 800 మీటర్ల కాలువ పొడిగించాల్సి వస్తోంది. దీనికి అదనంగా 10 కోట్లు అదనంగా అవసరమని జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది. జగన్ ఇచ్చిన హామీ మేరకు గుంటూరు వాహిని పొడింగించాలని లేదంటే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని రైతులు స్పష్టచేస్తున్నారు.