బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆది ధ్వని సంగీత వాయిద్యాల ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. గుంటూరు బృందావన గార్డెన్స్‌లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో 220కి పైగా వాయిద్యాలను అందుబాటులో ఉంచారు. ప్రధానంగా ఆదివాసీల నగార, డప్పులు, రుంజులు, కోయ డోలు, డమరుకం, బుర్ర కథలు, చిడతలు, విల్లు నిర్వహించే గజ్జలు, తబాల, వీణ, మృదంగం, నాదస్వరం వంటి అనేక రకాల సంగీత వాయిద్యాలు ఈ ప్రదర్శనలో పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి వాయిద్యాలు చూడలేదని స్థానికులు చెప్పారు.
కొన్ని తెగల నుంచి వాయిద్యాల సేకరణ
సంగీత వాయిద్యాలను సజీవంగా ఉంచాలన్నదే తమ తాపత్రయమని ఆది ధ్వని నిర్వాహకులు చెబుతున్నారు. గిరిజన జానపద సంగీత ప్రదర్శనలో 120కి పైగా వాయిద్యాలను ప్రదర్శించామని చెప్పారు. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి.. ఎంతోకాలంగా పరిశోధించి కళాకారులను వెదికి పట్టుకుని ఇన్ని రకాల వాయిద్యాలను సేకరించినట్లు తెలిపారు. జానపదులు ఒకనాడు తయారు చేసుకున్న వాద్యాలు ఇప్పుడు వారి వద్ద లేవు. అయితే కొన్ని బృందాలు, తెగలవారు వాయిద్యాలను కాపాడుకోవటం విశేషం. అలా వారి దగ్గర నుంచి సేకరించిన వాద్యాలను గత మూడు దశాబ్దాలుగా క్షేత్ర పర్యటన ద్వారా పరిశోధించి కాపాడుతున్నామని చెప్పారు.
మ్యూజియం ఏర్పాటు చేసే యోచనలో నిర్వాహకులు
సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవాలన్న బాధ్యతను అందరికి గుర్తు చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు అధిధ్వని నిర్వాహకులు. జానపదాన్ని నమ్ముకున్న కళాకారులలో ఉత్సాహం నింపడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయి. అరుదైన వాయిద్యాలను పరిరక్షిస్తూ వాటి కోసం ప్రత్యేకంగా అస్తిత్వాన్ని కాపాడేలా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.
ఇదీ చదవండి:
అదిరింది అబ్దుల్లా స్కిల్... తొక్కకుండానే వెళ్తుందీ సైకిల్