లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ బార్ అండ్ రెస్టారెంట్లో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బార్‌లోని మద్యం స్టాక్‌కు సంబంధించిన రికార్డులను ఎక్సైజ్ సీఐ సుహాసిని పరిశీలించారు. తనిఖీ చేసిన అనంతరం బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
పాడేరు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు
విశాఖ మన్యం పాడేరులో మద్యం దుకాణాల్లో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలను లెక్కగట్టి కొన్ని దుకాణాలను సీజ్ చేశారు.
ఆబ్కారీ శాఖ తనిఖీలు
గుంటూరు జిల్లా ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోసూరు సీఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని మద్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకూ పరిశీలించిన మద్యం దుకాణాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని సీఐ వెల్లడించారు.
చిలకలూరిపేటలో ఆకస్మిక తనిఖీలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని 11 బార్ అండ్ రెస్టారెంట్లు, 9 మద్యం దుకాణాలలో అధికారులు తనిఖీ చేశారు. గుంటూరు ఎక్సైజ్ సీఐ రేఖా రెడ్డి, ఎస్ఐ మాధవి, వార్డు సచివాలయ సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సీలు వేసే ముందు ఉన్న నిల్వలు ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిశీలించి తేడా ఉన్న దుకాణాలపై కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ రేఖా రెడ్డి తెలిపారు.
మద్యం దుకాణాల్లో తనిఖీ చేసిన జిల్లా టాస్క్‌ఫోర్స్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని రవి తేజ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్‌ను పరిశీలించిన అనంతరం ఎటువంటి తేడాలు లేవని రెవెన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
అద్దంకిలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ
ప్రకాశం జిల్లా అద్దంకి, కొరిసపాడు మండలాల్లోని మద్యం దుకాణాలలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. అద్దంకి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి మద్యం దుకాణాలలో సోదాలు నిర్వహించారు. రికార్డుల్లో ఉన్న నిల్వలు... దుకాణాల్లో ఉన్న నిల్వలతో సరిపోయినట్లు సీఐ వెల్లడించారు.